బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గనిపిస్తుంది
కేసీఆర్ పక్కన ఎలా కూర్చోపెట్టుకుంటున్నారో
రేవంత్ రెడ్డి సెటైర్లు
కాంగ్రెస్ పార్టీలోకి బెల్లంపల్లి బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్: గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేరారు. ఈ నేపథ్యంలో వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు మీదే క్రియాశీలక పాత్ర అన్నారు. బీజేపీని ఎవడు ఓడించలేడు అనుకున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి చూపించిందన్నారు. జేడీఎస్ కోసం.. కాంగ్రెస్ ని చీల్చాలని .. కేసీఆర్ కూడా కృషి చేశారని ఆయన మండిపడ్డారు.
కర్ణాటక ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి… కర్నాటకలో బీజేపీ కి పోలిక ఉందని, ఇక్కడ 30 శాతం కమిషన్ సర్కార్, కర్ణాటక లో 40 శాతం కమిషన్ సర్కార్ అని ఆయన అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గనిపిస్తుందని రేవంత్ రెడ్డి.. కానీ కేసీఆర్ పక్కన ఎలా కూర్చోపెట్టుకుంటున్నారోనని సెటైర్లు వేశారు. దుర్గం చిన్నయ్యనో.. దుర్బుద్ధి చిన్నయ్యనో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏ అరాచకం చూసినా బీఆర్‌ఎస్ నాయకులు ఉంటున్నారని, ఇంతకు ముందు… రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చేవని, కానీ ఇప్పుడు అత్యాచారం కేసుల్లో కూడా బీఆర్‌ఎస్ నేతలు ఉంటున్నారన్నారు.
‘‘రాష్ట్రంలో దండుపాళ్యం (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు) ముఠా ఎక్కడికక్కడ దోచుకుంటోంది. ఇసుక, ల్యాండ్, మైనింగ్, లిక్కర్ వ్యాపారంలోనూ బరితెగించింది. చివరకు రేప్ కేసుల్లో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్లే ఉంటున్నారు. మాట మాట్లాడితే కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు మంత్రి హరీష్ రావు దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు. రేప్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు రోడ్ మోడలా..?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఎస్సీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సమీక్ష చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ అధికారులు.. ప్రభుత్వ పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామన్న ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. ప్రశ్నాపత్రాల లీకేజీలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసి విచారించాలి, ప్రశ్నా పత్రం లీకుకి కేటీఆర్ కారణమని, కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలన్నారు. అంతేకాకుండా.. ఆయన ధన దాహమే లీకులకు కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా
సొంత వ్యవహారంలా దశాబ్ది ఉత్సవాలు
22న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
ఖమ్మంలో భారీ సభకు ప్లాన్
కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్ కు లేదు
చేరికలపై ఊహాగానాలు వద్దు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ సొంత వ్యవహారంలా చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీన్ని ఖండించాలన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామన్నారు రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ గారు బాధ్యత వహిస్తారన్నారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. 10 రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ సొంత వ్యవహారంలా చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీన్ని ఖండించాలన్నారు రేవంత్. ఈ కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని ఫైర్ అయ్యారు. పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయిందని దుయ్యబట్టారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఈ నెల 22న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయాలన్నారు రేవంత్ రెడ్డి. ఈ నిరసన ర్యాలీలో రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్ పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పారు. ఆర్డీవో కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు. కేజీ టూ పేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్ , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ హామీల విషయంలో తెలంగాణ సర్కార్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ పై చర్చ జరుగుతోందన్నారు. భట్టి పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని చెప్పారు. ఖమ్మంలో జాతీయ నాయకులతో ఒక భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. భట్టితో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి. బీసీలలో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బీ నర్సింగరావు గారు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.. అలాంటి ఆయనకు ప్రభుత్వ పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ఇప్పటికైనా వారిని గౌరవించి వారికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. పదేళ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారని రేవంత్ దుయ్యబట్టారు. రెండో రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందా? రాష్ట్రానికి వెళ్తుందా తెలియాలని డిమాండ్ చేశారు. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.