“కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే… కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు”

రేపు గాంధారిలో నిరుద్యోగ దీక్ష

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే… కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడు. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ దొంగలను కటకటాల్లోకి నెట్టాలి. రేపు ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నా.” అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శనివారం కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సరంపేట చౌరస్తా నుంచి కామారెడ్డి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కామారెడ్డి బిడ్డ. వందలాది మంది ప్రాణత్యాగంతో తెలంగాణ తెచ్చుకుంటే… ఒరిగిందేమిటి? బొంబాయి, దుబాయి.. బొగ్గుబాయి అంటూ.. మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు గల్ఫ్ బాధితులకు కేసీఆర్ ఏం చేశారు? తెలంగాణలో గుంటనక్కలు కాంగ్రెస్ పార్టీని పీక్కు తిన్నా సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. మేకతోలు కప్పుకున్న తోడేలు లంతోడు గంప గోవర్ధన్. కామారెడ్డి ప్రజలను నట్టేట ముంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఔటర్ రింగు రోడ్డు పేరుతో ప్రజల్ని నట్టేట ముంచ్చలనుకుండు..మీ పోరాటంతో వెనక్కు తగ్గిండు. మళ్లీ బీఆరెస్ గెలిస్తే మీ భూములను గుంజుకుని మిమ్మల్ని ఆగం చేస్తారు.తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉంది.

తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. మా పోరాట ఫలితంగా 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడు. పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ దొంగలను కటకటాల్లోకి నెట్టాలి. రేపు గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు దీక్షకు తరలిరండి. 2004లో గెలిపించినట్టే.. 2024లో 50వేలకు పైగా మెజారిటీతో షబ్బీర్ అలీని గెలిపించండి. ఆయన ఒక్క సంతకంతో ఎన్ని నిధులంటే అన్ని నిధులు ఇచ్చే కుర్చీలో కూర్చునేలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. కాళేశ్వరం 20,21,22 ప్యాకేజి పనులు పూర్తి చేసి ఉమ్మడి నిజామాబాద్ లో 3లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాం.

రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే : రేవంత్ రెడ్డి

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సరంపల్లి చౌరస్తా నుంచి రాజంపేట వరకు యాత్ర నిర్వహించారు. తర్వాత అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. నోటికొచ్చిన అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల గుండెలపై తంతున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీలో నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడితే 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎంసెట్, ఏఈ, సింగరేణి, విద్యుత్ శాఖ, గ్రూప్-1 పేపర్లు లీక్ అయ్యాయి. రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే. బీఆర్ఆర్ఎస్ దొంగలు, పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయి. పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారు.

పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం కేటీఆర్..కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీ కి పంపించిన కేసీఆర్….పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదు? ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయండి పేపర్ లీక్ వ్యవహారంపై 22న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్ ను కలుస్తాం. బీఆరెస్, బీజేపీ కుమ్మక్కు ఏమిటో అమీతుమీ తేల్చుకుంటాం. నిరుద్యోగుల జీవితాలు ఆగమైతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదు? తక్షణమే కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. టీఎస్పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి..సిట్టింగ్ జడ్జి తో, లేదా సీబీఐ తో విచారణ చేయాలి. పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పోరాడుతుంది..కేసీఆర్ పాలనకు ఇక కాలం చెల్లింది. దేవుడు కూడా కేసీఆర్ పక్షాన లేడు.

రేపు నిరుద్యోగ దీక్ష చేయనున్న రేవంత్ రెడ్డి

పాదయాత్ర కోసం కామారెడ్డి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం లంచ్ క్యాంప్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ నిరసన దీక్ష చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ తెలంగాణ మోడల్ పేరుతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్.. మాక్సిమం పాలిటిక్స్. కాంగ్రెస్ కష్టపడి పారదర్శక విధానం తెస్తే… కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేశారు.

తెలంగాణలో అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యక్తి. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్న పత్రం లీకేజీ ఇష్యులో మొదట హానీ ట్రాప్ అని, రెండోసారి హాకింగ్ జరిగిందని, తరువాత లీకయిందని చెప్పారు. నిజాలు బయటకు వస్తుండటంతో పరీక్షలను రద్దు చేశారు. లీకేజీ ఇష్యులో ఇద్దరిలో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అని బీఆరెస్ చెబుతోంది. ఐటీ మంత్రి ఏం చేస్తారో తెలుసా అంటూ కేటీఆర్ తోండి వాదనకు దిగుతున్నారు. రెండో ముద్దాయి బీఆరెస్ వాళ్లని బీజేపీ చెబుతోంది. బీఆరెస్, బీజేపీ లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. అసలు కేటీఆర్ అన్నం తింటున్నాడా..? ఇంత బరితెగించి మాట్లాడుతున్నారు. ఇదే మొదటిసారి జరిగినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు. 2015లో సింగరేణి ఉద్యోగాల భర్తీ చేసేందుకు జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయింది.

కవితకు కూడా అందులో భాగస్వామ్యం ఉందని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. 2016లో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకైంది. మూడు సార్లు అభ్యర్థులు ఎంసెట్ పరీక్ష రాయాల్సి వచ్చింది. 2017 సింగరేణి నియామకాల్లో ప్రశ్నాపత్రం లీకైంది. 2019లో ఇంటర్ మూల్యాంకణం లోపభూయిష్టంగా జరిగింది. 60వేల మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు ఇంటర్ మూల్యాంకనం అప్పగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం డ్రామారావు. గ్లోబరీనా విషయంపై ప్రశ్నించిన మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ దాడులు చేయించి జైల్లో పెట్టారు. రద్దు చేయడం కూడా గొప్పతనం అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతుండు. 155 నోటిఫికేషన్లు 37వేల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు.

లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని గతంలో కేటీఆర్ చెప్పింది అబద్ధమని ఒప్పుకున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలన్నింటిపై విచారణ చేయాలి. తనకు సంబంధం లేదని కేటీఆర్ చెబుతున్నారు. ఐటీ మంత్రికి సంబంధం లేనపుడు కేటీఆర్ సీఎం రివ్యూలో ఎందుకు కూర్చున్నారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడకుండా.. కేటీఆర్ ఎందుకు మాట్లాడారు? విచారణ అధికారులను, సిట్ అధికారులు, మంత్రి వర్గాన్ని సమావేశానికి ఎందుకు పిలువలేదు? కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు లీకేజ్ ఇష్యులో అరెస్ట్ చేసిన 9 మందిని విచారణ చేయలేదు. ఇద్దరు వ్యక్తులే నేరానికి పాల్పడ్డారని కేటీఆర్ ఎలా ప్రకటిస్తారు? బీఆరెస్ లో ఉన్న పెద్ద తలల్ని కేటీఆర్ కాపాడారు.

అధికారులపై ఒత్తిడి చేయడానికే కేటీఆర్ ఈ ప్రకటన చేశారా? రాజశేఖర్, ప్రవీణ్ పెద్దలకు తెలియకుండానే వ్యవహారం నడిపారా? ఇంటి దొంగలు బయటపడతారనే కేటీఆర్ హడావుడిగా బయటకు వచ్చారు. ఈ తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ బాధ్యత వహించాలి. కేసును పూర్తిగా నీరుగార్చేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. కేసును సీబీఐ తో విచారణ చేయించాలి. సీబీఐ పై నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. కల్వకుంట్ల కుటుంబం అగ్ని పరీక్షకు నిలబడాల్సిందే. కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి.

నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలి. 22న గవర్నర్ ను కలిసి పరిణామాలను వివరిస్తాం. కేటీఆర్ పీఏ పాత్ర కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మల్యాల మండలానికి చెందిన వంద మందికి గ్రూప్-1లో 100కుపైగా మార్కులు వచ్చాయి. దీనిపైన కూడా పూర్తి విచారణ చేయాలి. సిరిసిల్ల నిరుద్యోగి చనిపోతే సానుభూతి తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఆ కుటుంబాన్ని బెదిరించి దహన సంస్కారాలు పూర్తి చేయించారు. కన్నకొడుకు మరణిస్తే ఏడ్చే అవకాశం కల్పించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X