హైదరాబాద్ : జనవరి 26 నుంచి రాష్ట్రంలో పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర ద్వారా ప్రతీ కార్యకర్తను కలుస్తూ ముందుకెళతామన్నారు. ఆదివారం గాంధీ భవన్ లో పీసీసీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నూతనంగా నియమితులైన డీసీసీలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఏఐసీసీ ఆదేశాల ప్రకారం పలు తీర్మానాలకు సమావేశంలో ఆమోదం తెలిపారు. నూతన కమిటీలను నియమించిన మల్లికార్జున ఖర్గే గారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు… రాహుల్ గాంధీ సాహసోపేతమైన భారత్ జోడో యాత్రను అభినందిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. జనవరి 3, 4 న శిక్షణ తరగతులను నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు రేవంత్. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత వివిధ రాష్ట్రాల్లో కొత్త కమిటీలను నియమించుకున్నారన్నారు. తెలంగాణ లోను జనవరి 26 లోగా నూతన జిల్లా, మండల, డివిజన్, గ్రామ కమిటీ నియామకాలు చేసుకోవాలన్నారు. సమన్వయ కర్తల సాయంతో స్థానిక నేతల సంప్రదింపులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాహుల్ గాంధీ సాహసోపేత పాదయాత్ర
బీజేపీ విభజన రాజకీయాలను తిప్పి కొట్టేందుకే రాహుల్ గాంధీ సాహసోపేత పాదయాత్ర చేపట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతీ ఇంటికి చేరవేస్తామని ఆయన చెప్పారు. మోదీ, కేసీఆర్ చేసిన మోసాలను ఛార్జ్ షీట్ ల రూపంలో ఇంటింటికీ అందిస్తామన్నారు. జనవరి 26 నుంచి ప్రతీ గ్రామంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానాలు ప్రజలకు తెలియజెప్పేలా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటామని తెలిపారు రేవంత్. జనవరి 26 నుంచి ప్రజల్లోకి పాదయాత్రగా ప్రజల్లోకి వెళతాం
మార్పు కోసమే యాత్ర ఫర్ చేంజ్
ఏఐసీసీ ఆదేశాల మేరకు జనవరి 26 నుంచి చేపట్టే పాదయాత్రకు పూర్తి సమయం కేటాయిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రజల జీవితాల్లో, పరిపాలనలో మార్పు కోసం యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతోందన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి తన సర్వ శక్తులు ఒడ్డుతానని ఆయన తెలిపారు. సహచరులమంతా ప్రజల కోసం కష్టపడి.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామన్నారు. ప్రజల సమస్యల ముందు పార్టీలో తనలాంటి నాయకులకు కలిగే అసౌకర్యాలు అంత పెద్దవి కాదని చెప్పారు.
సీవీ ఆనంద్ నారద ముని పాత్ర పోషిస్తున్నారా?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ రూమ్ పై దాడి చేసి తమ విలువైన సమాచారాన్ని పోలీసులు దొంగిలించారని ఆయన ఆరోపించారు. ఐఐటీ, ఐఐఎం నిపుణులను సైబర్ క్రైమ్ పోలీసులు బట్టలు విప్పి కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్ ప్రయివేటు సైన్యంలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. తమ నాయకులకు తప్పుడు సమాచారం ఇచ్చి సీవీ ఆనంద్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సీవీ ఆనంద్ నారద ముని పాత్ర పోషిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మెప్పు పొంది సీవీ ఆనంద్ డిజీపీ పోస్టు తెచ్చుకోవాలనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జరిగే పరిణామాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపుతుందని తెలిపారు రేవంత్.