ఆలయ అభివృద్ధికి సహకరించి, ప్రత్యేకంగా అభినందించిన సీఎం కేసీఆర్ కు సదా రుణపడి ఉంటాం
ఆలయ పునః ప్రతిష్టను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : కాకతీయుల కాలంలో నిర్మించి, 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అద్భుత కళా విశిష్టత కలిగిన వరంగల్, పర్వతగిరి (మంత్రి స్వగ్రామం) లోని పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగిన నేపథ్యంలో దీనిని రాష్ట్ర స్థాయి పవిత్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెలిపారు.
తెలంగాణ చరిత్రను, కళలను, విశిష్టతను భావి తరాలకు అందజేస్తూ, మన వారసత్వ సంపదను పరిరక్షించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు పర్వతగిరి శివాలయాన్ని ఇంకా గొప్పగా అభివృద్ది చేసేందుకు వేగంగా పనులు నిర్వహించనున్నట్లు చెప్పారు.
జనవరి 26,27,28 తేదీల్లో నిర్వహించిన పర్వతాల శివాలయం పునః ప్రతిష్ట పవిత్ర కార్యం విజయవంతం కావడం పట్ల ఇందుకు సహకరించిన వారందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పేరు పేరునా నేడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన అతిథులు, ముఖ్యులు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.
సమిష్టి కృషితో, భక్తి శ్రద్ధలతో చేసిన ఈ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారని, ఇందుకు వారికి సదా రుణపడి ఉంటామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించి, ఆశీర్వదించిన సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మహిమాన్విత పర్వతాల శివాలయంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని, కన్నుల పండువగా శివరాత్రి మహోత్సవం జరపాలని, భక్తులకు అన్ని వసతులు కల్పించాలని ఆలయ ధర్మకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులను ఆదేశించారు.
ఈ కాన్ఫరెన్స్ లో ఆలయ ధర్మకర్త కల్లెడ రామ్మోహన్ రావు, ఆలయ బాధ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.