పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు కూడా అయిన రవిచంద్రతో సమావేశమైన అసోసియేషన్ నాయకులు
పెట్రోలియం మంత్రితో సమావేశం ఏర్పాటు చేయించాల్సిందిగా కోరిన అసోసియేషన్, అందుకు సానుకూలంగా స్పందించిన రవిచంద్ర
హైదరాబాద్: తాము ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవలసిందిగా తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ రాజ్యసభ సభ్యులు, పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు విజ్ఞప్తి చేసింది. స్థాయి సంఘం అధ్యయన యాత్రను ముగించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న రవిచంద్రను అసోసియేషన్ అధ్యక్షులు మర్రి అమరేందర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది.
ఈ సందర్భంగా అమరేందర్ రెడ్డితో కలిసి అసోసియేషన్ నాయకులు వినోద్ విశ్వనాథ్, ఎల్వీ కుమార్, సురేష్, దినేష్ రెడ్డి, అనిల్,విక్రమ్, మహ్మద్ ఖాలిద్ షరీఫ్ తదితరులు రవిచంద్రకు వినతిపత్రం అందజేశారు. ఎంపీ వద్ధిరాజు వారితో అరగంట పాటు సమావేశమై డీలర్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని సావధానంగా విన్నారు.
తామిప్పుడు పెట్రోల్ లీటరుపై రూ 3.40,డీజిల్ లీటరుపై రూ. 2.21మాత్రమే కమీషనుగా పొందుతున్నామని, వీటిని రెట్టింపు చేయాల్సిందిగా కోరారు.అలాగే, పెట్రోలులో ఇంథనాల్ కలపడాన్ని 10 నుంచి 20 శాతానికి పెంచారని, అండర్ గ్రౌండ్ ట్యాంకులను ఫైబర్ కోటింగ్ చేశాకే దీనిని అమలు పర్చేలా చొరవ తీసుకోవలసిందిగా కోరారు.
అలాగే, పెట్రోలియం మంత్రి హరిజిత్ సింగ్ పురి, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ రమేష్ బిధూరియాలతో సమావేశం ఏర్పాటు చేయించాల్సిందిగా అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్ విశ్వనాథ్, కోశాధికారి ఎల్వీ కుమార్ చేసిన విజ్ఞప్తి పట్ల ఎంపీ రవిచంద్ర సానుకూలంగా స్పందించారు.