“మాట తప్పిన నిన్నేం చేయాలి కేసీఆర్…?”

-మాట తప్పిన నిన్నేం చేయాలి కేసీఆర్…?

-జేపీఎస్ లారా… మీరేం భయపడకండి

-మీకు అండగా మేమున్నాం…సమ్మెను కొనసాగించండి

-సీఎం, మంత్రులను బయట తిరగనీయకుండా అడ్డుకుంటాం

-ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం

-కేసీఆర్ ప్రభుత్వం ఉండేది మరో 5 నెలలే

-బీజేపీ అధికారంలోకి రాగానే జేపీఎస్ లందరినీ విధుల్లోకి తీసుకుంటాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ : న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగించేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జూనియర్ కార్యదర్శులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదే. వారు చేస్తున్న సమ్మెకు బీజేపీ ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది.

• నేనడుగుతున్నా… జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేసిన తప్పేంది? పరీక్షలు రాసి పాసై ఉద్యోగాల్లో చేరి నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు. ఏ ఉద్యోగానికైనా ప్రొబేషనరీ పీరియడ్ ఏడాదో, రెండేళ్లో ఉంటుంది. కానీ వీళ్లకు మాత్రం ప్రొబేషనరీ పీరియడ్ మూడేళ్లు పెట్టినా పనిచేశారు. రెగ్యులరైజ్ చేయకుండా మళ్లీ మరో ఏడాది గడువు పెంచడం ఎంత వరకు సమంజసం? మనసులో ఎంత బాధ ఉన్నా భరిస్తూ రాత్రింబవళ్లు పనిచేస్తూ నాలుగేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేశారు. అయినప్పటికీ నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం. వీళ్లంటే కేసీఆర్ కు ఎందుకంత కక్ష? కేసీఆర్ కుటుంబానికి లంచాలు ఇవ్వలేదేమో.. పైసలిస్తే ఈపాటికే రెగ్యులరైజ్ చేసేవాళ్లేమోననే అనుమానం కలుగుతోంది.

• వాస్తవానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో ఇచ్చిన మాట తప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మాట నిలబెట్టుకోవాలని కోరుతూ గత 11 రోజులుగా నడి ఎండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. వాళ్ల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్దమైనవే. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని సమ్మె చేస్తున్న జూనియర్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులిస్తారా? మరి మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి?

• రుణమాఫీ, ఫ్రీ యూరియా, నిరుద్యోగ భ్రుతి, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలు అమలు చేస్తానని హామీలిచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు కావొస్తున్నా అమలు చేయకుండా మాట తప్పిన కేసీఆర్ ను ఏం చేయాలి?

• కేసీఆర్ దగ్గర అధికారం ఉంది కదా? అని రెక్కాడితే డొక్కాడని కార్యదర్శులపై ప్రతాపం చూపిస్తారా? కేసీఆర్ అధికార అహంకారంవల్ల ఇప్పటికే వీఆర్వో వ్యవస్థను సర్వనాశనమైంది. వీఆర్ఏలు నెలలు తరబడి రోడ్డున పడ్డారు. 23 వేల మంది ఆర్టిజన్లు సమ్మె చేసి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 22వేల మంది స్కావెంజర్ల జీవితాలను రోడ్డున పడేశారు.. ఇయాళ పంచాయతీ కార్యదర్శుల బతుకులను కూడా బర్ బాద్ చేయాలనుకోవడం కేసీఆర్ అమానవీయ చర్యలకు నిదర్శనం.

• జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఏం చేసినా చెల్లుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. వాళ్లకు బీజేపీ అండగా ఉంటుంది. వాళ్లను ఉద్యోగాల నుండి తొలగిస్తే కేసీఆర్ ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.

• ఈ సందర్భంగా కేసీఆర్ కు వారం రోజులు గడువిస్తున్నాం…పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. లేనిపక్షంలో పంచాయతీ కార్యదర్శులు కలిసి సీఎంసహా మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం… అవసరమైతే న్యాయపరమైన చర్యలకూ వెనుకాడబోం.

• జూనియర్ పంచాయతీ కార్యదర్శులెవరూ భయపడొద్దు… భయపెట్టి కార్యదర్శుల్లో ఉన్న ఐక్యతను చీల్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. అందరూ ఐక్యంగా ఉండండి. ఇన్నాళ్లు సమ్మె చేశారు. భార్యాబిడ్డలకు దూరమై రాత్రింబవళ్లు పనిచేశారు. ఉద్యోగాల నుండి తొలగిస్తే ఇంట్లోనే ఉండండి. కార్యదర్శుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగేది మరో 5 నెలలే. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుంది. తొలగించిన ఉద్యోగులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X