“కేసీఆర్‌, బిడ్డ, అల్లుడు, కొడుకు అందరికి కలిసి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తా”

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనజాతర పేరుతో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను వెంట్రుక కూడా పీకలేరంటూ కేసీఆర్ అంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేకుండా లాగేయగలరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని తాను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డినంటూ రేవంత్ రెడ్డిని అంటూ గుర్తు చేశారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

గతంలోబిడ్డా అల్లుడు వస్తే ఎక్కడా పండబెట్టాలంటూ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని తెలంగాణ ప్రజలకు కట్టివ్వలేదని కానీ కేసీఆర్‌కు మాత్రం బిడ్డ, అల్లుడు కొడుకు అందరికి కలిసి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను దోపిడీ దొంగలుగా, అడవి పందుల్లా అడ్డగోలుగా దోచుకున్నారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలు విరిగిందని కూతురు జైలుకు వెళ్లిందని అధికారం పోయిందని మొన్నటి వరకు ఏమీ అనకుండా జాలి చూపించామని కానీ ఇప్పుడు ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి.

మరోవైపు బీజేపీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడించామని ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కూడా అదే ఉత్సాహంతో ఓడించాలంటూ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు. మతం పేరిట చిచ్చుపెట్టి మూడోసారి అధికారం చేపట్టాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక హైదరాబాద్‌లో వరదలొస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక్క పైసా అయిన తీసుకొచ్చారా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

రాహుల్ గాంధీ స్పీచ్ పాయింట్స్…

అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు ఈ వేదికపై వేదికపై జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను ఆవిష్కరించాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం జాతీయ స్థాయిలోనూ గ్యారంటీలను అమలు చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మాత్రమే కాదు భారత దేశ ఆత్మ. ఈ మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల జీవితాల్లో వెలుగులు తీసుకోస్తాం. యువ న్యాయం పథకం ద్వారా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం.

దేశంలో విద్యావంతులైన యువతకు నెలకు రూ.8500 ఉపకారవేతనంతో ఏడాదిపాటు అప్రంటీస్ షిప్ శిక్షణ అందిస్తాం. మహిళా న్యాయం పథకం ద్వారా ప్రతీ పేద మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందిస్తాం. దేశంలో ప్రతీ రోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతు న్యాయం పథకం ద్వారా రైతు రుణాల మాఫీ చేస్తాం. స్వామినాథన్ కమిటర్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. కార్మిక న్యాయం ద్వారా కార్మికులకు సామాజిక, ఉద్యోగ భద్రత కల్పిస్తాం.

దేశంలో 50శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. 15శాతం దళితులు,8 శాతం గిటిజనులు, ఆదివాసీలు ఉన్నారు. 15శాతం మైనారిటీలు ఉన్నారు. 5శాతం ఇతర పేద వర్గాలు ఉన్నాయి. మోదీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సమన్యాయం జరగడం లేదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతాం. కులగణన దేశానికి ఎక్స్ రే లాంటిది. సామాజిక , ఆర్థిక అంశాలతో కూడిన కుల గణన చేపడతాం. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తాం.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ 50 శాతం మించకూడదనే పరిమితిని తొలగిస్తాం. తెలంగాణలో గత ప్రభుత్వం వేల మంది ఫోన్స్ ను ట్యాప్ చేసింది. మాజీ సీఎం ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారో మీరు చూశారు. ఫోన్ ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేశారు. ఇక్కడ కేసీఆర్ లాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఈడీని బలవంతపు వసూళ్ల సంస్థగా మార్చేశారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ రద్దు ఒక పెద్ద కుంభకోణం. సీబీఐ పేరుతో భయపెట్టి కంపెనీల నుంచి పార్టీ ఫండ్. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నాం.

రాజ్యాంగం ప్రజలకు రక్షణ.. కానీ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది. మేం రాజ్యాంగాన్ని రద్దు చేయనీయబోము. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతాం. బీజేపీ వైపు కార్పొరేట్ కంపెనీలు, ధనం ఉంది. ఇవేవీ లేకపోయినా కాంగ్రెస్ పై ప్రజల ప్రేమ ఉంది. మీతో నాకున్నది రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం. నా జీవితాతం మీకు సేవ చేస్తూనే ఉంటా. నా జీవితాంతం తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటా. ఏదో ఒక రోజు మేడ్ ఇన్ తెలంగాణ అనేది మేడ్ ఇన్ చైనా కంటే బలంగా వినిపిస్తుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X