తక్షణం 1,062 అధ్యాపక పోస్టుల భర్తీ
మరో వేయి అధ్యాపక పోస్టుల మంజూరు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీ నుంచి అధ్యాపక సంఘాల ప్రతినిధుల హాజరు
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ వద్ద గత ఐదు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న రాష్ట్రంలోని యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు ఆమోదం పొందగానే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు1,062 ఖాళీలను తక్షణం భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లో ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ( 11 ) యూనివర్సిటీల అధ్యాపక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/02/vinod.2-1024x343.jpg)
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రధానంగా ఉన్న పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో, మండలిలో ఆమోదించి రాజముద్ర కోసం గవర్నర్ కు పంపగా.. గత ఐదు నెలలుగా ఈ బిల్లు రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.
ఈ బిల్లు పై గవర్నర్ ఆమోదం లభించగానే ఇప్పటికే ప్రకటించిన 1,062 అధ్యాపక ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభిస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ఈ పోస్టులకు అదనంగా మరో వేయి అధ్యాపక పోస్టులను మంజూరు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వినోద్ కుమార్ వెల్లడించారు.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/02/vinod.3-1024x989.jpg)
దాదాపు రెండు వేల పైచిలుకు అధ్యాపక పోస్టులు భర్తీ అయితే రానున్న రెండు దశాబ్దాల వరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఉన్న పలు అంశాలను, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల సీ.పీ.ఎస్, ఏరియర్స్ అంశాలను, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ హామీనిచ్చారు. ఔటా వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జీ. మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఔటా నాయకులు సరస్వతమ్మ, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మల్లికార్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.