“తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం”

మరో సారి మోసపోయేందుకు
తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు రెండు సార్లు అవకాశమిచ్చారు. మరో సారి అవకాశమిచ్చి మోస పోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని కాశీంపల్లి గ్రామం నుంచి భూపాలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర్యం కోసం పదేళ్లు జైళ్లో ఉన్నారు.

ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలార్పించారు. రాజీవ్ గాంధీ గారు..18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించడంతోపాటు దేశానికి కంప్యూటర్లను పరిచయం చేశారు. ఆయన కూడా దేశసేవలో ప్రాణాలు విడిచారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాహుల్ గాంధీ గారు.. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం, ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉజ్జ్వల భవిష్యతు ఉంటుందని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈ నెల 6న మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించాను.

కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారు. మీ అభిమానాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. పోలీసుల అండతో కొంత మంది మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా… ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నవా? నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేద్కర్ చౌరస్తాకు రా నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతం. గత 23 తారీఖున మా సభతోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ కూడా ఉంది. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదనే విజ్ఞతో మేం ఆ రోజు సభ పెట్టలేదు. ఇవాళ ఆవారా గాళ్లు దాడులుచేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా? ఎస్పీ ఎమ్మెల్యే చుట్టమనే ఇలా వ్యవహరించారా? అధికారం శాశ్వతం కాదు అనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి.

దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, మైనార్టీలకు రిజర్వేషన్లు, గిరిజనులకు రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు..ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిదేళ్లలో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు.

తెలంగాణ తెచ్చిన అని చెప్పిన కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ పేదోడు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలకు ఇస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి.

————————————-

• కేసీఆర్ కూతురే కార్మిక సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నా
• సింగరేణి కార్మికుల సమస్యలు ఎందుకు తీరడం లేదు
• కేటీకే – 5 ఇంక్లైన్ గనిని కార్మికులతో గేట్ మీటింగ్లో
• టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

పాదయాత్రకు ముందు ఉదయం పూట భూపాలపల్లి లోని కేటీకే – 5 ఇంక్లైన్ గనిని రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించాకనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత, ఆర్టీసి కార్మిక సంఘానికి హరీష్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. కార్మిక సంఘాలను కూడా వారి కుటుంబమే గుతాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతున్నారు.

సీఎం కూతురే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా బొగ్గు గని కార్మికుల సమస్యలు పరిష్కరించడంలేదని ప్రశ్నించారు? వేలాది కోట్లను కొల్లగట్టడానికే తప్ప… కార్మికుల సమస్యలు తీర్చడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నించడం లేదు. ఈ తొమ్మిదేళ్లలో బీజేపీ, బీఆరెస్ అవిభక్త కవలల్లా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు వేరుగా ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ నిర్ణయాలన్నింటికీ కేసీఆర్ సహకరించారు. ప్రజా వ్యతిరేకత చూసి భయంతో వేరుగా ఉన్నామని చూపే ప్రయత్నం చేస్తున్నారు. తాడిచర్ల మైన్ ను కేసీఆర్ ఎవరికి అప్పగించారు. తాడిచర్ల మైన్ లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ ను ఆదానికి అమ్మేస్తే… దానిపై కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడాం అందుకే నైని కోల్ మైన్ అమ్మకం ఆగిపోయింది.

ప్రతిమా శ్రీనివాస్ కు లాభం చేకూర్చేందుకు కేసీఆర్ ఈ ఒప్పందానికి సహకరించింది వాస్తవం కాదా? కేసీఆర్, మోదీలది కార్పొరేట్ ఫ్రెండ్లీ విధానం. శ్రీధర్ ను సీఎండీగా కొనసాగించడం వెనక కేసీఆర్ కు ఉన్న ఉపయోగం ఏమిటో ఆలోచించండని కార్మికులను కోరారు. లాభాల్లో ఉన్న సింగరేణిని దివాళా తీయించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణకు అదేశిస్తాం.

సింగరేణిని లాభాల బాటలో పయనించేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే కార్మికుల కష్టాలు తీరుతాయో ఆలోచించండి. కార్మికుల సమస్యల పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ మారడు.. ఇక ఆయన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పిన కేసీఆర్ కు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉంది. తెలంగాణ సాధించడమే కాదు.. దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కార్మికులపై ఉందన్నారు రేవంత్ రెడ్డి.

—————————————-

• తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను
• ఒక్క కలం పోటుతో తొలగిస్తాం
• విద్యార్ధులతో మాట ముచ్చట కార్యక్రమంలో
• టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

భూపాలపల్లి లోని కేటీకే – 5 ఇంక్లైన్ గని సందర్శన తర్వాత కాశీంపల్లి గ్రామంలో విద్యార్ధులతో నిర్వహించిన మాట ముచ్చట కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. విద్యార్ధుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధుల పాత్రను వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమం. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా సమాజం కోసం పోరాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల వల్లే ఉవ్వెత్తున ఎగసింది. కేవలం రాజకీయ నాయకుల వల్లే తెలంగాణ ఏర్పడలేదు.

విద్యార్థుల త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. ఆడపిల్లల హాస్టళ్లలో మౌళిక వసతులు లేవని ఆడపడుచు గోడు వినిపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు తీసుకునేటపుడు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని మరో ఆడబిడ్డ చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ అందరితో మాట్లాడాక రాష్ట్రంలో పాలనను కేసీఆర్ గలికొదిలేసారని అర్థమైంది. కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే.. మినిమం గవర్నెన్స్ మాక్సిమం పాలిటిక్స్. దేశం ఆకలి తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్. బీడీఎల్, బీహెచ్ఈఎల్, రైల్వే, ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మినహాయింపు పొందిన పరిశ్రమల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థలను మోదీ ప్రయివేటుకు అప్పగించారు. లాభాలు వచ్చే సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తే.. రిజర్వేషన్లు అమలు జరగదు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 30 వేల స్కూల్స్ తెరిస్తే… కేసీఆర్ ప్రభుత్వంలో 6,354 సింగిల్ టీచర్ పాఠాశాలలు మూసేశారు.

దీంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు చదువు దూరమైంది. కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రయివేటు యూనివర్సిటీలు తెరిచి విద్యను వ్యాపారం చేస్తున్నారు. ప్రయివేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవు. బిశ్వాల్ కమిటీ 1,91,354 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పింది. కానీ రిటైర్ మెంట్ వయసు పెంచి ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు.

అధికారంలోకి వచ్చాక అన్ని విద్యా సంస్థల్లో 25శాతం రిజర్వేషన్ ఇచ్చేలా కాంగ్రెస్ విధానం తీసుకొస్తుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి తీరతాం. అధికారంలోకి వచ్చాక 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. శాఖల వారీగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం. 10 శాతం పైగా నిధులు విద్య కోసం ఖర్చు చేస్తాం. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి హాస్టళ్లను ఆదర్శంగా తీర్చి దిద్దుతాం.

రైతుల కోసం కాంగ్రెస్ ఎంఎస్పీ విధానం తీసుకోస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టానికి తూట్లు పొడిచింది. అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేసి రైతులను ఆదుకుంటాం. ఇంటికో ఉద్యోగం అంటే కేసీఆర్ దృష్టిలో వాళ్ల ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చుకునుడు. రాచరికపు పోకడలను ఇంకెంత కాలం భరిద్దాం? విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. విద్యార్థులు అనుకుంటే కేసీఆర్ ను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X