సెప్టెంబరు 9 కాళోజీ నారాయణరావు జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వని,తెలంగాణ జీవిత చలనశీలి,”కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న”గా అందరికీ సుపరిచితులైన ప్రజాకవి కాళోజి పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ.
1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో రమాబాయమ్మ, కాళోజీ రంగారావులకు జన్మించిన కాళోజీతెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది కాళోజీ కుటుంబం. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు.
Also Read-
కవిత్వంతో యువకుల్లో చైతన్యం నింపి తెలంగాణ ఉద్యమం వైపు ఉర్రూతలూగించిన తెలంగాణ ఉద్యమకారుడిని స్మరిస్తూ..
చరిత్ర పురుషా! కాళన్నా!
ఈ తిరంగావనిలో
రంగారావు, రమాబాయిల మణిపూసై
మణికొండయందు నరుడై
అవతరించిన నారాయణుడు
కలమునందు, గళము నందు
ఇదీ “నా గొడవ” యని
కోటి కలాలను, గళాలను స్పృశించే కాళోజీయై.
నిరంకుశ నిజాం పాలన,
రజాకార్ల అరాచకం
ఈ దుర్వ్యవస్థకు ఆగ్రహమై
అందరినీ ఆలోచింప జేసింది మీ “నా గొడవ” ఇది అందరి గొడవ.
అన్యాయాన్నెదిరించి, న్యాయం కోసం తప్పెవరిదైనా తరిమికొట్టమని
మన తలరాతలు, చేతి గీతలు
కత్తిపోటుతో కాదు,కలంపోటుతో మార్చుకోవాలని తెలిపింది మీ “జీవన గీత”.
“బతుకు చితికిపోతుంటే, గుండె పగిలిపోతుంటే శాంతియట శాంతియని” పలికినవి పలుకులు కావవి అందరి హృదయఘోష.
కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి, గొడవొక్కటి తెలంగాణ ఫలించేదాకా భారతాన ‘ఉద్యమాగబోదని’ పోరాటమే శ్వాసగా బ్రతికిన
ఓ మహానుభావా!
ఈ తెలంగాణ చరితకు నీ పుట్టుకే ఘన చరిత
ఓ అక్షరశిల్పి! ఓ ప్రజాకవి!
నీ పుట్టిన రోజే- తెలంగాణా తెలుగు పండుగ రోజు
ఓ చరిత్ర పురుషా!కాళన్నా!
ఇది నిన్ను స్మరించి తరించే రోజు
తెలంగాణ సాహితీవందనమర్పించే రోజు.
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9,2014 నుండి తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి,తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. 2024సంవత్సరానికి గాను బహుభాషా కోవిదుడు, ప్రముఖ అనువాదకుడు నలిమెల భాస్కర్ కు ఈ అవార్డు వరించిన శుభసందర్భాన వారికి శుభాభినందనలు తెలుపుతూ… సమాజంలోని అవినీతి, అసమానతలు, దోపిడీ దౌర్జన్యాలను నిరసిస్తూ ప్రతి కవి కాళోజీయై కలం కదిలించాలని ఆకాంక్షిస్తూ… అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
- డా రచయిత కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’