- మాజీ మంత్రి హరీశ్ రావు.
హైదరాబాద్ : రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రేమో రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదంటున్నరు.
మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 18వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామన్నరు. మరో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నరు.
ఇక ఈ రోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంతు. రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆయన పచ్చి అబద్దం చెప్పారు. ఏకంగా 31వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఏది నిజం. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలె.
ఇది కూడ చదవండి-
ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ల చూట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారు.
ఇప్పటికైనా రైతు రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలి. వెంటనే రుణమాఫీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆగస్టు 15 వరకు రైతులందరిని రుణవిముక్తులుగా చేస్తానన్న హామిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.