Hyderabad: నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజక వర్గంలో గన్నేరువరం బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ విగ్రహాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గార్లు ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… నేడు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ విగ్రహం ఏర్పాటు అసలు ఉద్దేశం ఈ దేశ నిర్మాణంలో ఇందిరాగాంధీ గారు కనపరిచిన పోరాట పటిమను, కర్తవ్యాన్ని నేటి యువతకు జ్ఞాపకం చేయాలనుకోవడమే.
పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… “ముఖ్యంగా నేడు పొత్తూరు నుండి గన్నేరువరం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని ఈ పాదయాత్ర చేపట్టడానికి కారణం ప్రభుత్వమే. 2014లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల విజ్ఞప్తులను లెక్కచేయకుండా అధికార బలంతో గన్నేరువరంను మండల కేంద్రంగా ఏర్పాటు చేసినారు.
ప్రతి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్డు నిర్మించే బాధ్యత మాదే స్వయంగా ముఖ్యమంత్రి గారే అన్నారు. రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ గన్నేరువరం నుండి గుండ్లపల్లి వరకు రోడ్డు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
గన్నేరువరం మండల ప్రాంతానికి చెందిన యువజన సంఘాలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ అధ్వాన్నంగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణం జరిగితే బాగుండు అని అనుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలు ఈ ప్రాంత యువజన సంఘాలు ధర్నా కార్యక్రమం చేపడితే పోలీసుల అరెస్టు చేస్తున్నారు.
నాడు ఇందిరా గాంధీ గారు గాని వాజ్ పేయి గారు గాని దేశంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం నిజాయితీగా పని చేయగలుగుతుందని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు ప్రతిపక్షం అనేదే ఉండకూడదు అన్నట్టుగా, ప్రశ్నించే వాడే ఉండకూడదు అన్నట్టుగా మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం అనుకుంటే ప్రజాస్వామ్యంలో నడవదు అని నిరూపించడానికే నేడు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఈ పాదయాత్రకు స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ కోర్టు అనుమతితో చట్టాన్ని గౌరవించే వారిగా ప్రజాస్వామ్యాన్ని రక్షించే వారిగా పూర్తిగా శాంతియుతంగా ఈ పాదయాత్ర చేపడుతున్నాము.
పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అధికార బలంతో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ పదవి తెచ్చుకున్న వినోద్ రావు గారు గాని ఈ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ గాని స్థానిక శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గాని ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడు చేపడతారో పత్రికా విలేకరుల సాక్షిగా ప్రజలకు చెప్పి రాజకీయ విమర్శలకు తావు లేకుండా, బాధ్యతగల ప్రభుత్వ ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించాలని ఈ సభా ముఖంగా కోరుతున్నాము.
అదేవిధంగా ఈ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని పక్కనే ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారిని కోరుతున్నాను. చొక్కారావుపల్లి నుండి ఎలగందుల వరకు బ్రిడ్జి నిర్మాణం చేపడితే అందరికంటే ఎక్కువగా లాభపడేది మంత్రి గంగుల కమలాకర్ కే అని, ఆ రోడ్డు నేరుగా గంగుల కమలాకర్ ఫామ్ హౌస్ ముందు నుండే వెళ్తుందని తన సౌకర్యం కోసం అయినా ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నామని అన్నారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో మనకు అన్యాయం జరిగిందని తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పటికీ మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఇప్పుడు ఎవరిని బద్నాం చేద్దామని అన్నారు. నేడు తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పోయిలో పడ్డట్లుగా అయ్యింది.
జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడేవిధంగా ఎటువంటి సమస్యలున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నేడు ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాను అని అన్నారు. చదువుకున్నవారు చదువుకోని వారు అనే తేడా లేకుండా టిఆర్ఎస్ నాయకులు సభ్యతను మరిచి, సంస్కారహీనులుగా మాట్లాడుతున్నారు. ఆఖరికి రసమయి బాలకిషన్ విలేకరుల పట్ల కూడా సభ్యత లేకుండా, వారిని వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ హయంలో పనులు సక్రమంగా జరిగేవని, ప్రతిపక్ష నాయకుల పట్ల మర్యాదగా వ్యవహరించే వారని, ఈటల రాజేందర్ గారు అనగా, నిన్న బిజెపి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై తెరాస నాయకుల ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడు ఈ విధంగా వ్యవహరించలేదని అనడమే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నిదర్శనం అని అన్నారు.
మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, చొక్కారావు పల్లె నుండి ఎలగందుల వరకు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మించాలనే ప్రధాన డిమాండ్ల సాధనకోసం నేడు జిల్లా కాంగ్రెస్ పక్షాన నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమం ప్రభుత్వమే.
గనిర్వరం నుండి గుండ్లపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇటీవల ఈ మండలానికి చెందిన యువజన సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపడితే వారిపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించిన స్థానిక శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ నిరసన కారులను అరెస్టు చేయించి 20 గంటల పాటు నిర్బందించడం జరిగింది.
ఈ నియోజకవర్గ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు సోయి ఉంటే గన్నేరువరం నుండి గుండ్లపల్లి వరకు డబల్ రోడ్డు నిర్మించాలని, మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, చొక్కారావు పల్లె నుండి ఎలగందుల వరకు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.”
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.