ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
పెన్షన్లకు ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అభయ హస్తం, వడ్డీ లేని రుణాలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు శ్రీ హరీష్ రావు గారు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమీక్ష చేశారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి ఆదేశాల మేరకు మంజూరు చేసిన ఫ్లడ్ డ్యామేజి మరియు మెయింటెనెన్స్ నిధులు 1867 కోట్ల రూపాయలు పనుల పురోగతి పై చర్చించారు.
గ్రామపంచాయతీలకు రావలసిన పెండింగ్ బిల్లుల గురించి చర్చించారు. రాబోయే రెండు ఆర్ధిక త్రైమాసికాలకు సంబంధించిన నిధులపై అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పెన్షన్లు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ ప్రక్రియ కొనసాగేటట్లు చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.