డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఘనంగా “రైటర్స్ మీట్” రజతోత్సవం
హైదరాబాద్ : రచయితలు సమాజానికి దారి చూపించే మార్గదర్శకులని గౌరవించాల్సిన భాద్యత అందరిపై ఉందని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు శాఖ కళల విభాగం ఆధ్వర్యంలో రచయితల సంఘం రజతోత్సవం సందర్భంగా “రైటర్స్ మీట్” కార్యక్రమం జరిగింది.

దీనికి విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అయన మాట్లాడుతూ రచయితలు, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్చగా మాట్లాడుకునేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ఒక వేదికగా ఉంటుందన్నారు. ఈ వేదిక ద్వారా రచయితలు వారి ఆలోచనలు, భావాలు, అనుభవాలు, సామాన్య ప్రజల సమస్యలకు గొంతుగా మారాలని అది తమ రచనల రూపంలో ప్రజలను చైతన్య పరచాలని రైటర్స్ సంఘం ప్రతినిధులకు సూచించారు. ఈ సంఘం స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకునే వేడుక “రజతోత్సవం”లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.




Also Read-
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రఖ్యాత రచయిత అల్లం రాజయ్య మాట్లాడుతూ విరసం లాంటి ప్రగతిశీల సంస్థల మూలంగానే డెమోక్రటిక్ స్పేస్ కోసం రైటర్స్ మీట్ సంస్థ ఏర్పాటైయిందని అన్నారు. 25 ఏళ్లుగా తెలుగు సాహిత్య వ్యాప్తికి, అధ్యయనానికి ఎనలేని కృషి చేస్తుండడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాతృ బాషకు సంక్షోభ కాలం నడుస్తోందిని, ఈ సంక్షోభ కాలాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువ రచయితలకు ప్రేరణ కలిగిస్తుందని, వారు కూడా మంచి రచనలు చేయాలని ఉత్సాహపడతారని, సమాజంలో సామాన్య ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు సూచించే విధంగా రచనలు చేయడానికి ఈ సదస్సు గొప్ప అవకాశం కల్పిస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలోని తెలుగు రచయితలను ఒకచోట చేర్చి, తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపుతుందిని పేర్కొంటూ కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు.

Also Read-
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఖధీర్ బాబు, ప్రఖ్యాత పాత్రికేయులు, సంపాదకులు డా. కె. శ్రీనివాస్, రచయిత వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, ప్రఖ్యాత రచయితలు ఎల్. వి. రెడ్డి, కె. ఎన్ మళ్లీశ్వరీ, కుప్పిలి పద్మ, బి. ఎస్. రాములు, ఎన్. రజని, వాసిరెడ్డి నవీన్, పలువురు కథకులు, పలు రాష్ట్రాల నుంచి రచయితలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
