హైదరాబాద్/వాంకోవర్ (కెనడా) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ) డిజిటల్ విద్య, కృత్రిమ మేధస్సు (ఏఐ), బోధనా సిబ్బంది నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆధారిత అభ్యాస రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కెనడాలోని వాంకోవర్ లో ఉన్న ‘కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్’ (COL)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సీఈవో ప్రొఫెసర్ పీటర్ స్కాట్ సంతకాలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ధోత్రే (ఐఏఎస్), ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్లు ప్రొ. రవీంద్రనాథ్ సోలమాన్, ప్రొఫెసర్ పల్లవి కాబ్డేతో పాటు కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గతంలో కుదిరిన అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా, స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ఈ నూతన భాగస్వామ్యాన్ని అమల్లోకి తెచ్చారు.
ఈ ఒప్పందం ప్రకారం మూడు ప్రధాన రంగాల్లో ఇరు విద్యా సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భాగంగా ఓపెన్ యూనివర్సిటీలో ఆధునిక లెర్నింగ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్), డిజిటల్ కోర్సులు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (ఓఈఆర్), ఈ-బుక్స్, డిజిటల్ బ్యాడ్జ్‌లు, బీఆర్‌ఏఓయూ టీవీ, డిజిటల్ రేడియో, అలాగే విద్యలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని విస్తరించేందుకు ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ల్యాబ్, ఉమ్మడి పరిశోధనలు, అధ్యాపకుల మెంటరింగ్, ఇంటర్న్‌షిప్‌లు, బహుభాషా ఏఐ అప్లికేషన్లు, భాషా అనువాద సాంకేతికతల అభివృద్ధిని బలోపేతం చేయడానికి COL సహకారం అందించనున్నది. దీంతో విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నాణ్యమైన ఉన్నత విద్యను మరింత విస్తరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇవే కాకుండా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ రూపకల్పన, పబ్లికేషన్ రీసెర్చ్ స్టడీస్, అంతర్జాతీయ మెంటర్‌షిప్ కార్యక్రమాలు, నిపుణుల సలహాలు, పీర్ లెర్నింగ్ నెట్‌వర్క్‌లు, ఉమ్మడి నిపుణుల బృందాల ఏర్పాటుకు కూడా ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది.
Also Read-
ఈ సందర్భంగా అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యాన్ని విశ్వవిద్యాలయ చరిత్రలో గేమ్‌చేంజర్‌గా అభివర్ణించారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, ఉత్తమ అంతర్జాతీయ విధానాలను BRAOUలోకి తీసుకువస్తుందన్నారు. దీనిద్వారా గ్లోబల్ స్థాయిలో ఏఐ ఆధారిత డిజిటల్ ఓపెన్ యూనివర్సిటీగా బి.ఆర్. అంబేద్కర్ వర్సిటీ వేగంగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న ఫీజులతో నాణ్యమైన ఉన్నత విద్యను ఎక్కువ మంది విద్యార్థులకు అందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
డిజిటల్ విద్యారంగంలో ఓపెన్ వర్సిటీ అంతర్జాతీయ మోడల్‌గా నిలుస్తుందని సీఈవో ప్రొఫెసర్ పీటర్ స్కాట్ కొనియాడారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి దూరదృష్టి నాయకత్వాన్ని ప్రశంసించారు. బీఆర్‌ఏఓయూ నిర్మిస్తున్న సమగ్ర డిజిటల్ ఎకోసిస్టమ్ భవిష్యత్ ఉన్నత విద్యకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఏఐ ఆధారిత ఓపెన్, డిస్టెన్స్, డిజిటల్ లెర్నింగ్‌కు ఆదర్శంగా ఎదగడంతో పాటు భారత్‌తో పాటు కామన్‌వెల్త్ దేశాల్లో నాణ్యమైన ఉన్నత విద్య విస్తరణకు విశేషంగా దోహదపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
