హైదరాబాద్ : కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన భాగంగా బంద్ పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక ఇచ్చిన బంద్ కు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్ లో వ్యాపార సంస్థలను మూసి వేయిస్తున్నారు. బందుకు మద్దతుగా విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు.
మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్ ను రైతులు – పోలీసులు చాలేంజ్ గా తీసుకున్నారు. కామారెడ్డి టౌన్ బంద్ కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు ఇవ్వడంతో రైతులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. హిాంసత్మక సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి టౌన్ లోకి వచ్చే రోడ్ ల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో రైతు జేఏసీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు రెండు బృందాలుగా కామారెడ్డి కి వెళ్తున్న కాంగ్రెస్ నేతలు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ల నేతృత్వంలో ఒక బృందం. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు, సీనియర్ నాయకులు బృందంగా నాయకులు కామారెడ్డి కి వెళ్తున్నారు.
బండి సంజయ్
ఈరోజు మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి పార్టీ నాయకులతో కలిసి కామారెడ్డికి బయలుదేరనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని పరామర్శించనున్న బండి సంజయ్. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బండి సంజయ్ నివాసం వద్ద, పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
బైక్ ర్యాలీ
మరోవైపు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరుతున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ తో ఇచ్చిన పట్టణ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జన సమితితో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. బంద్ ను విచ్చిన్నం చేయడానికి పోలీసులు ముందు జాగ్రత్తగా పొలిటికల్ లీడర్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్
కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ప్రపోజల్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, టెకిర్యాల్, ఇల్చిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వర్‌పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. దీంతో డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్లాన్‌లో ఇక్కడ 8.5 శాతం ఏరియా 1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రీయల్ కింద ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్ హైవే పక్కన… టౌన్ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పచ్చని పంటలు పండే అడ్లూర్, ఇల్చిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాలకు చెందిన భూములు ఉండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ జోన్లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ రాదని, నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని, ఫలితంగా భూముల విలువ తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా… తమకు చెప్పకుండా మాస్టర్ ప్లాన్ ఎలా తయారు చేస్తారంటూ రైతులు నిలదీస్తున్నారు. 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన మీదా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.