TPCC: హాత్ సే హాత్ జోడో అభియాన్ మీటింగ్ కు కాంగ్రెస్ సీనియర్ డుమ్మా, ముదిరింది గొడవ, హైకమాండ్ వైపు అందరి చూపు

హైదరాబాద్ : కాంగ్రెస్‌ అధిష్ఠానం అంటే ఒకప్పుడు ఎంతటి నాయకుడైనా గౌరవం ఉండేది. ఇప్పుడు పరిస్థతి మారిపోయింది. అధిష్ఠానం అంటే అందరికీ అలుసైపోయింది. దేశ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు సంక్షోభంలో పడింది. సోనియాగాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం కొనసాగినంత కాలం కాంగ్రెస్‌ పార్టీ బలంగా కనిపించినప్పటికీ ఆ పార్టీ పునాదులు ఇప్పుడు బలహీనపడటం మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థతి మరీ ఘోరంగా తయారైంది. నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతో హీటెక్కుతోంది.

కాంగ్రెస్ హైకమాండ్ కొత్త పీసీసీ కమిటీలను ప్రకటించిందో కానీ నాయకులు ఒక్కొక్కరు తిరుబాటు చేస్తున్నారు. మొదట కొండా సురేఖ నుండి మొదలైన ఈ అసంతృప్తి బెల్లయ్య నాయక్ వయా కాంగ్రెస్ సీనియర్ల వరకు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్ రిలీజ్ చేసిన 2-3 రోజులు సైలెంట్ గానే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదే అదునుగా రేవంత్ రెడ్డి న్యాయకత్వంపై తిరుగుబాటు చేసారు. ఈ రోజు సాయంత్రం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీకి ముందు చెప్పినట్టుగానే సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు. ఇప్పుడు నేటి భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు సీనియర్ల గైర్హాజరుపై రేవంత్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి ఇలా మాట్లాడడం సరికాదు. వాళ్ళకంటే మేము సీనియర్ నాయకులమే అని షబ్బీర్ అలీ, మల్లు రవి లాంటి నాయకులు చెప్పుకొచ్చారు.

భట్టి నివాసంలో నిన్న భేటీ అయిన సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీలలో 108 మంది ఉంటే అందులో 50 మంది టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మమ్మల్ని కోవర్టులుగా ముద్ర వేస్తున్నారు. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య పోరాటం జరుగుతుంది. టీడీపీ వచ్చిన వారి నుండి కాంగ్రెస్ ను సేవ్ చేయాలనే మేము చూస్తున్నాం. కాంగ్రెస్ ను హస్తగతం చేసుకోవాలనే వారి కుట్ర జరుగుతుంది. మేము నాలుగు పార్టీలు మారి రాలేదు. అసలు కాంగ్రెస్ నాయకులం మేమే. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో తేల్చుకుంటామని సీనియర్లు తెలిపారు. గెలిచే చోట డీసీసీ నియామకాలు ఆపారు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులు వలస వాళ్లకే కేటాయించారని మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గీయులు అన్నట్టు సీన్ కనిపిస్తుంది.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనిచేశారని ఆ పార్టీ నేత అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు నష్టం చేసిన వెంకట్‌రెడ్డితో ఉత్తమ్ ఎలా అంటకాగుతారు? అండగా ఉంటానంటూ వెంకట్‌రెడ్డి ఉత్తమ్‌కు ఎందుకు ఫోన్ చేశారు? అని ప్రశ్నించారు. మునుగోడులో వెంకట్‌రెడ్డికి ఉత్తమ్ పనిచేశారా? లేదా? అని ప్రశ్నించారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ప్రజల్లోకి వెళ్లనీయడం లేదని, సీనియర్లు ఆయనను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాదయాత్రను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రేవంత్ పాదయాత్ర వల్ల సీనియర్లకు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. ఇతర పార్టీలకు ఎలా లాభం చేయాలని చూస్తున్నారని, పాదయాత్రలకు సీనియర్లు వచ్చి చేసేదేముంది? అని అనిల్ ప్రశ్నించారు.

ఈ క్రమంలో 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 13 మంది నాయకత్వం ఇచ్చిన పోస్టులకు రాజీనామా చేస్తూ తమ రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మణిక్కం ఠాకూర్‌కు పంపించారు. ఈ రాజీనామా చేసిన వాళ్లంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గీయులే అని చర్చ జరగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X