కాంగ్రెస్ డిఎన్ఏ లో అవినీతి… మోసం కాంగ్రెస్ నీతి
కాంగ్రెస్ పార్టీ మార్కు కరప్షన్ కి, కన్నింగ్ నెస్ కి నిదర్శనం ఈ బడ్జెట్
అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గిన్నిస్ రికార్డు
కెసిఆర్ గారిని నిందించడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు
అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్న ప్రభుత్వానికి ప్రజల బుద్ధి చెబుతారు
అబద్ధాలు ఆపకపోతే ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం
బడ్జెట్ వాస్తవికంగా లేదు… దేశంలో రాష్ట్రం పరువు పోతుంది
అన్ని రంగాలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్: కాంగ్రెస్ డిఎన్ఏ లోనే అవినీతి ఉందని, మోసం అనేది కాంగ్రెస్ పార్టీ నీతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కేవలం కేసీఆర్ గారిని నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారని, అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. 420 హామీలు ఇచ్చి, గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టిచ్చి గ్యారంటీలు ఇప్పిచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారని, ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని,బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదు తేల్చి చెప్పారు.
బడ్జెట్ 2025-26 పై శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను, బడ్జెట్లో లోటుపాట్లను సమర్ధవంతంగా ఎండగట్టారు.

ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ … “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చుట్టపు లాగా వచ్చిపోతున్నారు. ప్రజావాణి వింటానని చెప్పి కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. ప్రజల్ని రోజూ కలుస్తానని చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ప్రజలను కలవడానికి ఇష్టపడడం లేదు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మార్కు కరప్షన్ కి, కన్నింగ్ నెస్ కి నిదర్శనం ఈ బడ్జెట్” అని మండిపడ్డారు.
Also Read-
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదని విమర్శించారు. కేవలం కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని పరిపాలన చేస్తున్నదని, ఉద్యమ కాలంలో కేసీఆర్ గారిని లక్షల తిట్లు తిట్టినా అవి ఆశీర్వాదాలుగా మారాయని గుర్తు చేశారు. కెసిఆర్ గారి హయాంలో అప్పులపై కాంగ్రెస్ పార్టీ పదేపదే దుష్ప్రచారం చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అబద్ధమని బడ్జెట్ ద్వారా తేలిపోయిందని వివరించారు. “పది సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. ఆయా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం కేవలం రూ. లక్షా 21 వేల కోట్లు మాత్రమే. అంటే మొత్తం బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 4 లక్షల 22 వేల కోట్లు మాత్రమే. ఈ లెక్కలను బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వమే పేర్కొంది మరి కాంగ్రెస్ పార్టీ అప్పులపై పదేపదే ఎందుకు అబద్ధాలు చెబుతుంది ?” అని నిలదీశారు.
రాష్ట్రానికి చోదక శక్తిగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం దివాళా తీసిందని ప్రకటించడం ప్రజల గుండెలకు గుబేలుమనవా అని అన్నారు. పెట్టుబడిదారులకు, ప్రజలకు విశ్వాసం కల్పించాల్సింది పోయి ఈ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడటం దారుణమని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మూలధన వ్యయం కింద ఏటా దాదాపు 43 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కేవలం మూలధన వ్యయంగా కేవలం 33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అంటే దాదాపు నెలకు 2700 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి ఏమో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెబుతున్నారని ఎండగట్టారు.
ఇక కీలకమైన ఇరిగేషన్ రంగానికి కేవలం 7.5 శాతం మాత్రమే కేటాయింపులు చేసి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతాంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం విమర్శించారు. “ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టు 148 ఎఫ్ఆర్ఎల్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం 44 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉండేది. 152 ఎఫ్ ఆర్ ఎల్ తో అయితే 160 టీఎంసీ ల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా కాలువలు తవ్వడం మొదలుపెట్టారు. దాదాపు 17 వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టును… మూడేళ్లలో 40,000 కోట్లకు అంచనాలను పెరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అంగీకారం లేదు, కేంద్ర జల సంఘం అనుమతులు కూడా లేవు. 160 టీఎంసీల ప్రాజెక్టు అని చెప్పి… రిజర్వాయర్ సామర్థ్యాన్ని మాత్రం కేవలం 16 టీఎంసీలకు మాత్రమే ప్రణాళిక వేశారు. అనేక సమస్యల సుడిగుండాల వల్ల తుమ్మిడిహెట్టి వద్ద కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టలేదు. తరతరాలపాటు తెలంగాణకు నీటి కష్టాలు రాకుండా ఉండేందుకే మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అన్ని సర్వేలు చేపట్టి, నీటి లభ్యతను లెక్క కట్టిన తర్వాతనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్ గారు దూరదృష్టితో నిర్ణయం తీసుకున్నారు” అని వివరించారు.
గంధమల్ల ప్రాజెక్టు సామర్ధ్యాన్ని 9 టీఎంసీల నుంచి 1.5 టీఎంసీలకు ప్రభుత్వం తగ్గించింది కానీ అంచనా వ్యయాన్ని మాత్రం 400 కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పెంచిందని, కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు ప్రకారం అంచనాలు పెంచిన పాత కాంట్రాక్టు కంపెనీకి ప్రాజెక్టును అప్పగించడం ఏమిటి ? అని ప్రశ్నించారు. కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లను తీసుకుంటున్నప్పుడు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని అన్నారు.
సింగరేణి సంస్థకు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు పడ్డది 39 వేల కోట్లు అని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నదని స్పష్టం చేశారు.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం గత ఏడాది తక్కువ వచ్చినప్పుడు… ఈ బడ్జెట్లో ఎక్కువ అంచనాలు ఎందుకు వేసినట్లు ? అని నిలదీశారు.
ఈ బడ్జెట్ వాస్తవికంగా లేదు… వాస్తవానికి దూరంగా ఈ బడ్జెట్ ఉన్నదని, ఈ బడ్జెట్ తో దేశంలో రాష్ట్రం పరువు పోతుందని స్పష్టం చేశారు. బీసీలకు అరకొరా నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని విస్మరించిందని, పెన్షన్ల మొత్తాన్ని పెంచడం, మహిళలకు 2500 ఇవ్వడం వంటి హామీల అమలు ఊసే లేదని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైంది ? ,మైనారిటీ, యువతకు ఇచ్చిన హామీల అమలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే వాటిని ఎలా అమలు చేస్తారు ? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.