-దగాపడ్డ తెలంగాణ ప్రజాలారా…
-మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే మహా కుట్ర జరుగుతోంది
-ఈసారి మోసపోతే గోసపడతాం… తస్మాత్ జాగ్రత్త
-లిక్కర్ స్కాంలో బిడ్డ, పేపర్ లీకేజీలో కొడుకు అవినీతి స్కాంల నుండి దారి మళ్లించే కుట్రలో భాగమే సీఎం లేఖ
-ఏనాడైనా ప్రజలను, కార్యకర్తలను ప్రగతి భవన్ లోపలికైనా రానిచ్చారా?
-ఎన్నడైనా పిలిచి బువ్వ పెట్టినారా?
-అటుకుల పేరుతో వేల కోట్లు దోచుకున్నడు
-కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టండి…
-అమరుల ఆశయాలు, ఉద్యమకారుల ఆకాంక్షల నెరవేర్చుకుందాం
-బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
-పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తాం….ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు బహిరంగ లేఖ
తెలంగాణ మహాశయులందరికీ నమస్కారం…
• బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ ప్రజలతోపాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖనే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఇయాళ కార్యకర్తలను ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్ద కకుట్ర దాగి ఉంది.
• సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ కు వస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌజ్ కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారు.
• తన కుటుంబమే పరమావధిగా వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యే సరికి అకస్మాత్తుగా కార్యకర్తలపైన ప్రేమ పుట్టకొచ్చింది. పేపర్ లీకేజీలో కొడుకు, లిక్కర్ స్కామ్ లో బిడ్డ పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోవడంతోపాటు అనేక స్కాముల్లో పాలుపంచుకుందనడానికి రుజువులు దొరుకుతుండటంతో తన కుటుంబ అవినీతిపై చర్చ జరగకుండా మరోసారి కార్యకర్తల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కేసీఆర్ ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది.
• ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాల కు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అనేక కుంభకోణాల వెనుక కేటీఆర్ కుటుంబ సభ్యుల హస్తమే ఉందని తెలంగాణ సమాజానికి అవగతమైంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా ఉండేందుకు ముందుగానే వారిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశాడు.
• ఆనాడు కార్యకర్తల, ఉద్యమకారుల త్యాగాలు, శ్రమతో ఏర్పడిన తెలంగాణను తన స్వార్ధం కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రశ్నించిన ఉద్యమకారులను, నాయకులను బయటకు పంపిన చరిత్ర కేసీఆర్ ది. తన అధికారాన్ని కాపాడుకునేందుకు తెలంగాణను అవమానించిన వాళ్లను, అవినీతిపరులను చేరదీసి అందలమెక్కించిన విషయాన్ని మర్చిపోగలమా?
• 9 ఏళ్లలో సామాన్య ప్రజల సంగతి దేవుడెరుగు… ఏనాడైనా కార్యకర్తలను పిలిచి కేసీఆర్ బువ్వపెట్టారా? ప్రగతి భవన్ కు వచ్చిన వాళ్లను లాఠీలతో కాళ్లు విరగ్గొట్టించిన కేసీఆర్ వేల కోట్లు సంపాదించి, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అటుకుల బుక్కి తెలంగాణ కోసం కొట్లాడామంటూ లేఖ రాయడం హాస్యాస్పదం.
• 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని, ఎందరో తెలంగాణ ఉద్యమకారుల రక్తం చిందించి తెలంగాణ తెస్తే నీళ్లు- నిధులు- నియామకాలన్నీ తన కుటుంబానికే సొంతం చేసుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా నట్టేట ముంచింది.
• దగాపడ్డ తెలంగాణ ప్రజలారా…. బీఆర్ఎస్ కార్యకర్తలారా… ఇప్పటికైనా మేల్కొనండి. ఒకసారి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయాం. ఇప్పటికే ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ కొట్టుమిట్టాడుతోంది. విద్య, వైద్యం అందక సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ అభివ్రుద్ధి కోసం కేంద్రం నిధులిస్తున్నా దారి మళ్లిస్తూ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తిరిగి కేంద్రంపై బురదచల్లే నీచమైన కుట్రలకు కేసీఆర్ తెరదీశారు.
• గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఈ నక్కజిత్తుల కేసీఆర్ మాటలను నమ్మితే నట్టేట మునిగిపోతాం. తస్మాత్ జాగ్రత్త. కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టేందుకు సిద్ధమవ్వండి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాటాలకు మద్దతు పలకండి.
• బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. పంట నష్టపోయిన రైతులందరికీ ఫసల్ బీమా యోజన కింద నష్ట పరిహారం అందిస్తాం. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాం.