- రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా?
- బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ఇంతవరకు డీఎఫ్ఆర్ ఇవ్వని మాట నిజం కాదా?
- తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పే
- నిరూపించేందుకు నేను సిద్ధం…. బహిరంగ చర్చకు సిద్ధమా?
- దమ్ముంటే డేట్, టైం, వేదిక ఫిక్స్ చేసి నా సవాల్ ను స్వీకరించాలి
- సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ కుమార్ ఛాలెంజ్
- బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఖబడ్దార్ అంటూ పోలీసులకు హెచ్చరిక
- కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారారంటూ ధ్వజం
- బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ల అంతు చూస్తాం.బిచ్చమెత్తుకునేలా చేస్తామని హెచ్చరిక
- జైలు నుండి విడుదలైన కమలాపూర్ కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్
హైదరాబాద్ : “వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతాం… రుణాలివ్వండి’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అయినప్పటికీ కేంద్రమే మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ బెదిరిస్తోందంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడం సిగ్గు చేటన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపైనా రాష్ట్ర్ ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల విషయంలో ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు.
ఈ మూడు అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే డేట్, టైం ఫిక్స్ చేసి నా సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ విసిరారు. ఈనెల 5న కార్యకర్తలతో కలిసి వెళుతున్న ఈటల రాజేందర్ పై విచక్షణారహితంగా బీఆర్ఎస్ గూండాలు చేసిన దాడులు చేసే క్రమంలో అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.
జైలు నుండి విడుదలై వచ్చిన ఆయా కార్యకర్తలను పరామర్శించేందుకు ఈరోజు బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిసహా స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
అందులోని ముఖ్యంశాలు…
ఈనెల 5న నియోజకవర్గంలో పర్యటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ గూండాలు దాడి చేసే క్రమంలో అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపడం సిగ్గు చేటు. జరిగిన సంఘటన మొత్తం తెలంగాణ సమాజం చూసింది. టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశ్వర్లు సహా కొందరు పోలీసులు బీజేపీ కార్యకర్తలపై విచక్షణ రహితంగా కొడతారా? కొట్టే అధికారం మీకెవరు ఇచ్చారు?
ఇంకెన్నాళ్లు గుండాయిజం చేస్తారు? మీరే గూండాలకు, ఫాల్తుగాళ్లకు తుపాకీ లైసెన్సులిచ్చి భూ దందాలు, లంగ, దొంగ దందాలు చేయమని చెబుతారు… ప్రశ్నించే కార్యకర్తలపై దాడులు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా?
బీఆర్ఎస్ ఉండేది మరో 3 నెలలే… బీజేపీ కార్యకర్తలను కొట్టిన ఏ పోలీసుల సంగతి చూస్తాం… వాళ్లది ఇక బిచ్చపు బతుకులే. పర్యవసానాలు తీవ్రంగా ఎదుర్కొక తప్పదు. మాకు లాఠీఛార్జీలు, కేసులు, జైలుకు పోవడం మాకు కొత్త కాదు… ప్రజలను కాపాడుకోవడానికి, పార్టీ సిద్ధాంతాల కోసం బరాబర్ ఎంతకైనా పోరాడతాం..
స్థానిక ఎమ్మెల్యే పర్యటిస్తుంటే తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? సీఎం కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుడి కొడుకు పర్యటనలకు మాత్రం భద్రత కల్పిస్తారు. వాళ్లు వస్తున్నారంటే మూడు రోజుల ముందే అరెస్ట్ చేస్తూ నీచంగా వ్యవహరిస్తున్నారు. కొందరు పోలీసుల తీరును సొంత కుటుంబ సభ్యులు కూడా హర్షించరనే విషయం గుర్తుంచుకోండి. కష్టపడి పనిచేసే పోలీసులు ఈ నీచపు పనులు చేయలేక లూప్ లైన్ లోకి వెళ్లిపోతున్నారు.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే… ప్రజలు చెప్పులను నెత్తిన పెట్టుకుని వెళ్లే బాంచన్ బతుకులు వచ్చే ప్రమాదముంది. ప్రజలు ఆలోచించాలి…
కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నన్నాళ్లు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్లకు కమీషన్లు ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు లేఖ రాసినా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదు.
కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరిండు… ఆ సవాల్ ను మేం స్వీకరించాం. టైం, డేట్ ఫిక్స్ చేయాలని చెప్పిన. ఎందుకు స్పందించలేదు. వెళ్లి ఫాంహౌజ్ లో పడుకున్నడు.
మేం తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం… మాకు రుణాలివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా? లేదా?…సమాధానం చెప్పాలే. కేంద్రానికి లేఖ రాసినట్లు నేను నిరూపిస్తా… దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యం.
సింగరేణి విషయంలోనూ ఇట్లనే పచ్చి అబద్దాలాడుతున్నరు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానిదే. 49 శాతం వాటా మాత్రమే కేంద్రానిదే. కేంద్రం సింగరేణిని ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది. అది సాధ్యం కానేకాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేసినా… మళ్లీ అబద్దాలాడుతున్నరు.
ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. చేసిన అభివ్రుద్ధి ఏమీ లేదు. దీనిపై చర్చకు రావాలని మేం కోరుతుంటే ప్రజలను దారి మళ్లించేందుకు ఇట్లాంటి పచ్చి అబద్దాలాడుతూ టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నడు.
సీఎం కుటుంబం దోపిడీకి అంతులేకుండా పోయింది. ఇది తెలిసే కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు నిధులిస్తుంటే… ఆ నిధులను కూడా సర్పంచ్ లకు సమాచారం లేకుండా దోచుకున్న దొంగ కేసీఆర్.
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్దం. గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు పోతుందో.. వస్తుందో ఎవరికీ తెల్వదు. వ్యవసాయానికి 24 కరెంట్ సరఫరా చేస్తనేలేదు.. ఎలక్ట్రిసిటీ సిబ్బందే నేరుగా రైతులకు సమాచార ఇస్తున్నారు.. త్రీ ఫేజ్ కరెంట్ తీసేస్తున్నాం… 24 గంటల కరెంట్ సరఫరా సాధ్యం కాదని సమాచారం ఇస్తున్నారు. అయినా సీఎం, మంత్రులు పచ్చి అబద్దాలాడటం సిగ్గు చేటు.
విద్యుత్ శాఖ సిబ్బందికి జీతాలే ఇయ్యడం లేదు. డిస్కంలకు ప్రభుత్వ శాఖలే 20 వేల కోట్లకుపైగా కరెంట్ బిల్లుల బకాయిలున్నయ్. వాటిని చెల్లించడం లేదు. ఉచిత కరెంట్ పైసలియ్యడం లేదు. డిస్కంలను రూ.70 వేల కోట్ల నష్టాల్లో ఉంచడంవల్ల ఆ సంస్థలు మూతపడే దుస్థితి ఏర్పడింది.