సెస్ ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్న టీఆర్ఎస్
మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంఛార్జీలుగా నియమించడం సిగ్గుచేటు
వేములవాడకు ఇస్తానన్న రూ.400 కోట్లు ఎందుకివ్వడం లేదు?
వేములవాడ ఎమ్మెల్యే జాడ ఏది?
మీ నాయన ఆశయాలను తుంగలో తొక్కుతుంటే ఏం చేస్తున్నావ్?
వేములవాడ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పిలుపు
హైదరాబాద్ : సెస్ ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. చిన్నపాటి సెస్ ఎన్నికల్లోనూ మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంఛార్జీలను నియమించి ఓటుకు రూ.5 నుండి 10 వేలు వెదజల్లేందుకు సిద్ధమయ్యారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని, సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
తండ్రి గొప్ప ఆశయంతో నెలకొల్పిన సెస్ ను టీఆర్ఎస్ నేతలు సర్వనాశనం చేస్తుంటే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలకు అందుబాటులో లేకుండా జర్మనీకే పరిమితమైన ఎమ్మెల్యే ను ఇంకెన్నాళ్లు భరిస్తారంటూ ప్రశ్నించారు. ఈరోజు సాయంత్రం వేములవాడ పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వందలాది బైక్ లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీమేశ్వర గార్డెన్స్ జరిగిన కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ ప్రసంగించారు.
బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
• మీ ఎమ్మెల్యే చాలా బిజీ… ఎప్పుడూ ప్రజలకు కన్పించరు. మీ నాయన మంచి ఉద్దేశంతో సెస్ ను ఏర్పాటు చేస్తే… ఆ సెస్ ను టీఆర్ఎస్ దుర్మార్గులను నాశనం చేస్తుంటే ఏం చేస్తున్నవ్.. మీ నాయన స్థాపించిన సంస్థను కాపాడుకోవాలనే సోయి లేదా? ప్రగతి భవన్ లో సీఎం ముందుకు నిలదీయవా? సెస్ ను రూ.450 కోట్ల అప్పుల్లో ఎందుకు ముంచారు? మళ్లీ ఆ అవినీతి పరులనే ఎందుకు సెస్ అభ్యర్థులుగా నిలబెట్టినవని అడగాలా? వద్దా? అట్లాకాకుండా మీ నాయన పెట్టిన సంస్థకే టోకరా పెడతవా? మీ నాన్నపై ఏమాత్రం ప్రేమ, అభిమానం ఉంటే… టీఆర్ఎస్ పాలకవర్గం సెస్ ను నిండా ముంచి…మా నాన్న ఆశయాలకు తూట్లు పొడిచారని చెప్పే దమ్ముందా? ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా జర్మనీలో ఉన్నా బాధలేదు… సెస్ ను దోచుకున్నా ఫరవాలేదనుకుంటే మీకు కష్టాలు తప్పవు.
• సెస్ ఎన్నికలకు కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంఛార్జీలుగా పెట్టి అడ్డదారుల్లో గెలవాలనుకోవడం సిగ్గు చేటు.ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇచ్చి కొనాలని చూస్తున్నరు. సెస్ చిన్న ఎన్నికలు… బీజేపీ ధాటికి తట్టుకోలేక ఎమ్మెల్యేలను, మంత్రులను దించుతున్నరు. ఇది బీజేపీ గొప్పతనం. ఇయాళ ఒకేచోట ఎన్నికలు కాబట్టి ఇంఛార్జీలను పెట్టగలిగినవ్.. రేపు సాధారణ ఎన్నికల్లో ఎవరిని ఇంఛార్జీలను నియమిస్తవ్? పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లను తీసుకొస్తవా?
• బీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నడు. జనం ఎవరూ బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కు గతిలేదు. ఇక దేశంలో యాడ ఉంది?* *
• సెస్ లో పొరపాటున టీఆర్ఎస్ ను గెలిపిస్తే… సెస్ కు ఇవే ఆఖరు ఎన్నికలు కాబొతున్నయ్… సెస్ ను ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిపేయడం ఖాయం. వినియోగదారుల భాగస్వామ్యంతో నడిచే సెస్ ను టీఆర్ఎస్ వచ్చాక కాంట్రాక్టర్ల రాజ్యమైంది. కాంట్రాక్టర్ల కోసమే టెండర్లు పెడుతున్నరు.
• సెస్ లో రూ.33 కోట్ల అవినీతికి పాల్పడ్డ నేతపై విచారణ జరపాలని క్రిష్ణయ్య కమిటీ నివేదికిస్తే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవ్. సిగ్గులేకుండా మళ్లీ ఆ వ్యక్తినే టీఆర్ఎస్ తరపున నిలబెడుతున్నరు.
• ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నన్ను చెప్పుతో కొడతానని ట్విట్టర్ టిల్లు అంటున్నడు. రేపు సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే… సెస్ సమస్యలను పరిష్కరించాలని వెళితే… మిమ్ముల్ని కూడా చెప్పుతో కొడతానంటడు జాగ్రత్త.
• కేసీఆర్ కుటుంబానికి కండ కావరం తలకెక్కింది. చెప్పుతో కొడతానని ఒకరు, తల ఆరు ముక్కలు చేస్తానని ఒకరు అడ్డగోలుగా మాట్లాడుతున్నరు.
• అధికారంలో ఉన్న పార్టీ చేతుల్లో సెస్ ను పెడితే సర్వనాశనం చేశారు. రూ.450 కోట్ల అప్పుల పాల్జేసినవ్. లాభాల్లో ఉన్న సంస్థను దివాళా తీయించారు. వినియోగదారులు బిల్లులు కడుతున్నరు. ప్రభుత్వ శాఖల నుండి రూ.160 కోట్ల బకాయి ఇవ్వడం లేదు. ఎస్సీ, ఎస్టీ కరెంట్ సబ్సిడీలు రూ.3.3 కోట్లు ఇయ్యడం లేదు.
• సెస్ లో అవినీతికి పాల్పడ్డ వారందరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్లను జైలుకు పంపుతాం. అవినీతి సొమ్మును జప్తు చేస్తాం. సెస్ ను లాభాల బాటలో నడిపిస్తాం. చెన్నమనేని రాజేశ్వరరావు, తంగళ్లపల్లి నర్సింగరావు ఆశయాలను కొనసాగిస్తాం.
• వేములవాడకు ఏం చేశావని నన్ను అడుగుతున్నరు. సిగ్గుండాలే… 3 ఏళ్ల నా పదవీ కాలంలో ఏడాది పాటు కరోనాతో పోయింది. వేములవాడ, కొండగట్టు అభివ్రుద్ధి కోసం ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపండి… నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని మూడేళ్లుగా మొత్తుకుంటున్నా… పట్టించుకోవడం లేదు. నిధులు తెస్తే బీజేపీకి పేరొస్తుందనే దుగ్దతో వేములవాడ అభివ్రుద్ధికి నోచుకోకుండా చేస్తున్నరు.
• వేములవాడ రాజన్న సన్నిధిలో పెళ్లి చేసుకున్న కేసీఆర్… ఆలయ అభివ్రుద్ధికి ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానన్నడు.. చివరకు పైసా ఇవ్వకుండా రాజన్నకే శఠగోపం పెట్టారు. పైగా వేములవాడ ఆలయ సొమ్మును వేరే జిల్లాకు తీసుకుపోతున్నరు. రాజన్న భక్తులు హుండీలో వేసిన సొమ్మును వేరే జిల్లాకు ఇచ్చే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు అభివ్రుద్ధి చేయవు. నిధులివ్వవు. పైగా రాజన్న పైసలను వేరే జిల్లాకు తరలిస్తవా?
• కేసీఆర్ పాలనలో వేములవాడ ఏం అభివ్రుద్ధి చెందింది? పైసా కూడా విదిల్చిన మూర్ఖుడు కేసీఆర్. వాస్తవ విషయాలు చెప్పి తప్పు చేశానని ముక్కు నేలకు రాసి సెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేది. అట్లాకాకుండా సెస్ ను నాశనం చేసిన టీఆర్ఎస్ నేతలే సిగ్గు లేకుండా సెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నరు.
• బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే సెస్ ను లాభాలబాటలో నడిపిస్తాం. అవినీతిపరులను జైలుకు పంపి ఆ సొమ్మును జప్తు చేస్తాం. చెన్నమనేని రాజేశ్వరరావు, తంగళ్లపల్లి నర్సింగరావు ఆశయాలను కొనసాగిస్తాం.
• నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెబుతున్నడు. నేను పరీక్షలకు సిద్ధంగా ఉన్నానని మొదటి నుండి చెబుతూనే ఉన్న. నువ్వు డ్రగ్స్ వాడుతున్నవని నాలుగేళ్లుగా మొత్తుకున్నా… ఇన్నాళ్లు నోరు మెదపని ట్విట్టర్ టిల్లు .. డ్రగ్స్ మానేసిన తరువాత టెస్ట్ కు సిద్ధమని చెప్పడం సిగ్గు చేటు. ట్విట్టర్ టిల్లు ముఖంలో భయం కన్పిస్తోంది.
• హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను రీ ఓపెన్ చేయాలి. విచారణ జరిపి దోషులను శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈడీ విచారణ స్టార్ట్ కావడంతో ట్విట్టర్ టిల్లుకు భయం మొదలైంది. అందుకే చెప్పుతో కొడతానని అవాకులు చవాకులు పేలుతున్నడు.
• సెస్ కు రూ.450 కోట్లు ఇవ్వు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వు. రుణమాఫీ చెయ్. దళిత బంధు ఇవ్వు. వేములవాడకు రూ.400 కోట్లు ఇవ్వు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వు. దళితులకు మూడెకరాలివ్వు… ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయ్.. అప్పుడు నీ చేతిలో చెప్పు దెబ్బలు తినేందుకు నేను సిద్ధం. జనం కోసం నా తల 6 ముక్కలు చేసుకునేందుకు కూడా సిద్ధమే. బతికినంత కాలం ప్రజల కోసం బతుకుతా.
• 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నానని కేసీఆర్ చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్దాలు. వ్యవసాయానికి 15 గంటలే కరెంట్ సరఫరా చేయాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన సంగతి గుర్తుంచుకోవాలె.
• కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కింది. వాళ్లకు గుణపాఠం చెప్పే అవకాశం సిరిసిల్ల, వేములవాడ ప్రజలకు వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలి. ఆ కుటుంబ అహంకారాన్ని అణగదొక్కాలి. పైసలు తీసుకుని టీఆర్ఎస్ కు ఓటేస్తే అవినీతిపరులకు కొమ్ముకాసినట్లే. సెస్ ను కాపాడుకోవాలంటే బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరుతున్నా.