హైదరాబాద్ : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత ‘దేశద్రోహి’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన మానసిక స్థితిని, ఆయన అసహనాన్ని తెలియజేస్తోంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోంది అని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.
ఒక పార్టీ జెండాతో గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి, క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. అదేరోజు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వేరే పార్టీల టికెట్లపై ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. దానం నాగేందర్ ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే, రాహుల్ గాంధీ ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆ నియోజకవర్గాల ప్రజలు ఓ పార్టీని నమ్మి ఓటేశారు. కానీ కాంగ్రెస్ ఆ ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ.. ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంది. ఇదే అసలైన ‘ఓట్ చోరీ’ అంటే. ఫిరాయింపుల ద్వారా ప్రజల తీర్పును దొంగిలించిన పార్టీకి.. ఇతరులు ఓట్లు దొంగిలించారని ఆరోపించే నైతిక హక్కు లేదు.
ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోతూ.. నిరాశ నిస్పృహలకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు వీరిని ఛీత్కరించినప్పుడల్లా ఏం చేయాలో పాలుపోక రాజ్యాంగబద్ధ సంస్థలపై వారి అసహనాన్ని వెల్లగక్కుతున్నారు.
Also Read-
నిన్న సుప్రీం కోర్టు.. ఇవాళ ఎన్నికల కమిషన్.. రేపు మరో సంస్థ.. ఇలా కాంగ్రెస్ ప్రతి సంస్థపై తన అక్కసు వెల్లగక్కుతూనే ఉంటుంది. అవినీతి నాయకులపై ఈడీ, సీబీఐలు విచారణ జరిపితే కూడా కాంగ్రెస్ గగ్గోలు పెడుతూ.. విచారణ సంస్థల దుర్వినియోగం జరుగుతోందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజంగానే విచారణ సంస్థలను దుర్వినియోగం చేసేదే నిజమైతే.. ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఎందుకు తిరుగుతున్నారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. మన సాయుధ బలగాల పరాక్రమంపై సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేస్తారు.. మన సైనికులు, పారా మిలటరీ బలగాల త్యాగాలపై ప్రశ్నలు సంధిస్తారు. కాంగ్రెస్ ఓడిపోతే చాలు అన్ని సంస్థలపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.
కాంగ్రెస్.. సుప్రీం కోర్టును నమ్మదు.. ఎన్నికల కమిషన్‌పై నమ్మకం ఉంచదు.. ఈవీఎంపై అనుమానాలు వ్యక్తం చేస్తుంటుంది. చివరకు మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సాయుధ బలగాలను కూడా విశ్వసించదు. రాహుల్ గాంధీ గారూ.. మరి తమరు ఎవరిని నమ్ముతారు?
మీ నయవంచన రాజకీయాలకు, రాహుల్ గాంధీకి ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారు. SIR నిర్వహించిన చోట ‘ఓట్ చోరీ’ ద్వారా బీజేపీ గెలిచిందంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వచ్చారు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. SIR నిర్వహించిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాలేదు.. SIR నిర్వహించిన కేరళలో మీ కాంగ్రెస్ నేతృత్వంలోని UDF అధికారంలోకి వచ్చింది. SIR ప్రక్రియ ద్వారా నకిలీ ఓటర్లను తొలగించి ద్వారా తమ పార్టీకి ప్రయోజనం జరిగిందని కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్‌లో కూడా SIR ప్రక్రియ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించిన 20 నియోజకవర్గాల్లో టీఎంసీ 13 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచింది. SIR ప్రక్రియ బీజేపీ కుట్ర అయితే.. SIR నిర్వహించిన ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు మెజారిటీ స్థానాల్లో గెలవలేదు? SIR ప్రక్రియ బెంగాల్‌లో కుట్ర అయితే.. కేరళలో ఎందుకు మీకు వరంగా కనిపిస్తోంది? కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మోసం చేసే గెలిచాయని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు.. వేరే పార్టీలు గెలిస్తే అది ప్రజాస్వామ్యానికి విఘాతమా? మీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
కాంగ్రెస్ ఒక్కసారి తన చరిత్రను వెనక్కి తిరిగి చూసుకోవాలి. పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ ఒక ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితులైన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన సిఫారసును కనీసం మీరు పట్టించుకోలేదు. అదే కమిషనర్ 2009 ఎన్నికలను పర్యవేక్షించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.
మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ M.S. గిల్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఆతర్వాత కేంద్రమంత్రిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నిష్పక్షపాతిగా, ఆదర్శమూర్తిగా రాహుల్ గాంధీ స్వయంగా పొగిడిన మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ T.N. శేషన్ గారు కూడా కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది నిజం కాదా? ఇలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ స్వతంత్రత గురించి ఇప్పుడు నీతులు చెబుతుంటే వినాల్సి వస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా లక్షలాది మంది బూత్ ఏజెంట్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు ఉంటే.. తెలియజేయడానికి చాలా సమయం ఇచ్చారు. అయినా కూడా ఎలాంటి అభ్యంతరాలు దాఖలు చేయలేదు. ‘ఓట్ చోరీ’ జరిగిందని రాహుల్ గాంధీ ప్రమాణపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేస్తే మౌనం వహించారు. మరి అలాంటప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తారు?
ఎన్నికల సంఘం స్వతంత్రమైన రాజ్యాంగబద్ధ సంస్థ అనే విషయంలో మాకో క్లారిటీ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థ వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. చేసుకోదు కూడా. పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 92 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. అలాంటి ఓటర్లను ఇరాక్, ఉత్తర కొరియా ప్రజలతో రాహుల్ గాంధీ పోల్చడం నిజంగా సిగ్గు చేటు. ప్రధానమంత్రి, హోంమంత్రిపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
