హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫోకస్ చేశారు. ఈనెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. సభ పోస్టర్ ను ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
Also Read-
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి హాఫ్ గ్యారంటీ కూడా అమలు చేయడం లేదని అన్నారు. బూటకపు హామీలు.. బోగస్ మాటల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కొడంగల్ కేంద్రంగా పాంచజన్య శంఖారావం పూరిస్తున్నామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతో పాటు తమ పాంచజన్యంలోని ప్రతి హామీని వంద శాతం నెరవేర్చి తీరుతామన్నారు. యువత, మహిళలు, సబ్బండ వర్గాల వికాసం, సాధికారత కలిగిన బహుజన తెలంగాణాను సాకారం చేయడమే తమ లక్ష్యమన్నారు.

టీఆర్ఎస్ లోకి బీజేపీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ చార్జీ
బీజేపీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ ప్రభాకర్ కులకర్ణి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కులకర్ణితో పాటు ఆయన అనుచరులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. కవిత నాయకత్వంలో బహుజన తెలంగాణ సాధన కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని కులకర్ణి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అర్చనా సేనాపతి, గవినోళ్ల శ్రీనివాస్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
