హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (SIR) లో పారదర్శకత లోపించిందని, జవాబుదారీతనం కరవైందని, విధానపరమైన లోపాలున్నాయని, పౌర సమాజం, బుద్ది జీవులు ప్రశ్నించాలని ప్రఖ్యాత ఆర్థిక, సామాజిక విశ్లేషకులు, రచయిత డా. పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని, భారత రత్న పి.వి. నరసింహారావు 105 వ జయంతిని పురస్కరించుకొని పీవీ స్మారకోపన్యాసాన్ని గురువారం డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సీఎస్టీడీ భవనంలోని డా. సి. నారాయణ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పరకాల ప్రభాకర్ “ఎస్ఐఆర్ 2025-26: భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేయడమా?” అనే అంశంపై ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితానే పునాది అని అన్నారు. కాగా SIR పేరుతో ఉన్న ఓట్లను తొలగించడం ప్రాజాస్వామ్యానికి, రాజ్యంగా రచయిత డా. అంబేద్కర్ ఆలోచనకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందనే వంద సంవత్సరాల క్రితమే దేశంలోని అన్ని కులాలకు చెందిన వయోజనులకు ఒకే ఒక్క ఓటు అనే సిద్దాంతాన్ని డా. అంబేద్కర్ ప్రతిపాదించి రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. గతంలో ఓటర్లు నాయకులను ఎన్నుకునేవారాని అది ప్రాజాస్వామ్యం అని, కానీ ఇప్పుడు నాయకులే తమకు నచ్చిన వారిని ఓటర్లు గా ఉండేలా నిర్ణయిస్తున్నారని ఇది మంచి పరిణామం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, అందరూ ఉన్నత విద్యను అభ్యసించేలా సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రజాస్వామ్య విలువలను సగర్వంగా నిలబెదుతున్నామని వెల్లడించారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న డా. పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ భారతరత్న పి. వి. నరసింహారావు గారితో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారతదేశపు గొప్ప నాయకులలో పీవీ ఒకరిని దగ్గర నుండి గమనించే అవకాశం లభించడం ఒక “అర్హత లేని భాగ్యం” అని అభివర్ణించారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛల స్థితిపై, ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం, విద్యాసంబంధ చర్చలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వందేమాతరం పై కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వంటి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విస్తృతంగా చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై కచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించాల్సిన అంశాన్ని ప్రస్తావిస్తూనే ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ముగించగా ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలి పోయాయని, ఆలోపే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిసిపోయాయని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను జాబితా ల నుంచి తీసేశారని వీటిపై ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పేవారే లేరన్నారు.

2002లో చేపట్టిన విస్తృత సవరణతో పోలిస్తే ప్రస్తుత ఓటర్ల జాబితా (SIR) గణనీయంగా భిన్నంగా ఉందని డా. ప్రభాకర్ వాదించారు. అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల నుండి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించినట్లు సూచించే గణాంకాలను పేర్కొంటూ, ఈ ధోరణులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ మైనారిటీలు, దళితులు, ఆదివాసులు, మహిళలు, రోజువారీ కూలీలు, ఆర్థికంగా బలహీన వర్గాలపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు కోల్పోయింది కూడా ఈ వర్గాలే అని వెల్లడించారు. ఆదరాబాదరాగా ఇప్పటికిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో SIR నిర్వహించాల్సిన అవసరం లేదని, ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉందని పేర్కొన్నారు. SIR ప్రక్రియ ద్వారా అక్రమ వలసదారులను గుర్తించారన్న వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవని డా. పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల నుండి పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడం వల్ల, అర్హులైన అనేక మంది పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు.

సమాజంలోని మేధావులు మేల్కొని రాష్ట్రంలోని వయోజనుల సంఖ్య కంటే ఒక్క ఓటు తక్కువగా ఉన్నా వదిలే ప్రసక్తి లేదని ఎన్నకల అధికారులకు హెచ్చరించాలని పిలుపునిచారు. కేంద్ర ఎన్నకల సంఘంలో జావాబుదారీ తనం లేకుండా పోయిందని, SIR విధానపరమైన నిర్ణయాల పై సంబంధిత ఫైల్స్ ఇవ్వాలని RTI ACT ద్వారా అడిగితే ఎలాంటి పత్రాలు అందుబాటులో లేవని సమాధానం ఇస్తున్నారని ఇక్కడే అనుమానాలు వస్తున్నాయని ఆయన వివరించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి మరింత పారదర్శకత, విధానపరమైన నిర్ణయాలపై ప్రజల్లో విస్త్రుత చర్చ ఉండాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా బుద్ధి జీవులు వ్యవహరించాలని డా. పరకాల ప్రభాకర్ సూచించారు.

భారతరత్న పి.వి. నరసింహారావు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన అద్భుతమైన నాయకత్వం, మేధస్సు, రాజనీతిజ్ఞత దేశంపై చెరగని ముద్ర వేశాయని కార్యక్రమంలో గౌరవ అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ సురభి వాణి దేవి పేర్కొన్నారు. తన తండ్రి పీవీ, ప్రజా జీవితమంతా సమానత్వం, పురోగతి, సామాజిక న్యాయం వంటి విలువలను పాటిస్తూ, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని ఆమె వివరించారు.

కార్యక్రమంలో గౌరవ అతిధిగా పాల్గొన్న డైరెక్టర్ (అకాడమిక్) ప్రొ. జి. పుష్ప చక్రపాణి సభకు స్వాగతం పలికి, భారతరత్న పి.వి. నరసింహారావు దూరదృష్టితో కూడిన నాయకత్వం, ఆయన రాజకీయ చతురత దేశాభివృద్ధికి దిక్సూచిగా పనిచేసిందని వివరించారు. మహానీయుల జయంతి లను పురస్కరించుకొని ప్రత్యేక చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా నిలుస్తుందని ప్రొ. జి. పుష్ప చక్రపాణి వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్య అతిథి, ప్రముఖులు, అధ్యాపక బృందం, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కె. రెడ్డి వందన సమర్పణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X