తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శక్తిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నితిన్ నబిన్ మాట్లాడుతూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శక్తిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి విచ్చేసిన సీనియర్ కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక అభినందనలు.

రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంపూర్ణ శక్తితో, అంకితభావంతో పనిచేసి భాగ్యనగర భవిష్యత్తును మార్చబోతున్నారు. భాగ్యనగర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి అభివృద్ధి దిశగా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. దేశ సమైక్యతకు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విజన్‌నే, ప్రధాని నరేంద్ర మోదీ “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” రూపంలో ముందుకు తీసుకెళ్తున్నారు.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆ ఆలోచనను సాకారం చేసే దిశగా మనకు మార్గదర్శనం చేశారు. నేను భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడినైనా, నా అసలు బలం కార్యకలే. భారతీయ జనతా పార్టీకి నిజమైన శక్తి కార్యకర్తలే. పార్టీకి ఉత్సాహం, బలం అందించేది కార్యకర్తలే. మన బూత్ అధ్యక్షులతో ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని మనం సంకల్పించాలి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, సేవతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.

అధికారం అనేది ప్రజలపై పాలన చేయడానికి కాదు… ప్రజలకు సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమే అని మోదీ చూపించారు.
తెలంగాణ ప్రజల మద్దతుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. తెలంగాణ ప్రజల కల ఇంకా పూర్తికాలేదు. ప్రజలు ఆశించిన మార్పు ఇంకా రాలేదు. అవినీతి, కుటుంబ పాలన చేస్తున్న రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి.

తెలంగాణను అవినీతి, కుటుంబ రాజకీయాల బంధనాల నుంచి విముక్తి చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదీ. ప్రతి బూత్‌లో కమలం వికసించేలా పనిచేద్దాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధిద్దాం. కొందరు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కొత్త పార్టీ అంటున్నారు. కానీ వారికి చరిత్ర పూర్తిగా తెలియదు.1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు తెలంగాణ ప్రాంతం నుంచే ఎన్నికయ్యారు. అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీపై విశ్వాసం ఉంచారని ఇది స్పష్టంగా చెబుతోంది.

Also Read-

తెలంగాణతో మా అనుబంధం కేవలం రాజకీయ బంధం కాదు… అది పోరాటం, విశ్వాసం, గౌరవంతో ముడిపడి ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అరాచక పాలన నుంచి బయటపడింది. ఇప్పుడు అదే మార్పు తెలంగాణలో కూడా రావాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం సంఖ్యాపరంగా మనం వెనుకబడి కనిపించవచ్చు. కానీ బీజేపీ కార్యకర్తల కష్టం, శ్రమ, త్యాగంపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

తెలంగాణలో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం బలంగా గళం వినిపించారు. రాజకీయ లాభనష్టాలు చూడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని మాత్రమే ఆమె ఆలోచించారు. తెలంగాణ ప్రజలు ప్రేమతో “చిన్నమ్మ” అని పిలిచే సుష్మా స్వరాజ్ గారి కృషిని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన త్యాగాలు ఎంతో గొప్పవి. ఆ పోరాటంలో బీజేపీ కార్యకర్తల పాత్ర కూడా ఎంతో కీలకం.

తెలంగాణ ప్రజల కలలను పూర్తిగా సాకారం చేయగలిగేది నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని మొదటి నుంచి చివరి వరకు ఎదిరించి పోరాడింది భారతీయ జనతా పార్టీయే. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ తన పాత రాజకీయ సంస్కృతినే కొనసాగిస్తోంది. కాంగ్రెస్ కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇస్తుంది.. అమలు కోసం కాదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలమైన శక్తిగా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిదీ. ఎన్నికల్లో గెలవాలంటే గెలుపు సంకల్పంతో ముందుకు సాగాలి.

ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త మూడు ముఖ్యమైన సంకల్పాలు చేయాలి. మొదటి సంకల్పం – ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి కుటుంబం దగ్గరకు బీజేపీ కార్యకర్త చేరుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలి. రెండో సంకల్పం – ప్రతి ఓటరును సంప్రదించాలి. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలి. మూడో సంకల్పం – కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ కలవాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. సమాజంలోని ప్రతి వర్గంతో అనుబంధం పెంచుకోవాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి.

త్వరలో జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అభివృద్ధి రాజకీయాలా? లేక కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రజల చేతిలో ఉంది. భాగ్యనగర భవిష్యత్తును మార్చాలంటే మనం ప్రజల మధ్యకు మరింత బలంగా వెళ్లాలి. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి వ్యాపారి, ప్రతి లబ్ధిదారుని కలిసి వారి ఆశీర్వాదం కోరుదాం. బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఈరోజు తెలంగాణ యువతను మోసం చేస్తోంది. బీజేపీ యువ కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు బలంగా వివరిస్తారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుతో పోటీ చేసే ప్రతి అభ్యర్థిని పూర్తి శక్తితో గెలిపించాలి. తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ప్రతీకగా మారింది.

గత బీఆర్ఎస్ సర్కారు పేద ప్రజల కష్టార్జిత ధనాన్ని దోచుకునేందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు, అవినీతికి పాల్పడిన దోషులను శిక్షించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆపదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X