ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే చర్చ జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాదాపు రెండేళ్లు అవుతున్న సందర్భంలో ఈ ఉపఎన్నిక ఇటు అధికార పార్టీకి, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కి అగ్నిపరీక్షగా మారాయి. అసలు జూబ్లీహిల్స్ లో ఏం జరగబోతోంది? ఎవరు గెలవబోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం చేధించడానికి పీపుల్స్ పల్స్ బృందం పలు శాస్త్రీయ పద్ధతుల్లో నెల రోజుల పాటు సర్వే నిర్వహించింది. హిందూ-ముస్లింలు, గల్లీలు-బస్తీలు, పేదలు, ధనికులు కలగలసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసఫ్గూడ, ఎర్రగడ్డ, షేక్పేట్, సోమాజిగూడ, రెహమత్నగర్, వెంగళ్రావునగర్, బోరబండ డివిజన్లలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేసింది.
అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో లోపాలు, హైడ్రా కూల్చివేతలు, నల్లా బిల్లులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ కోతలు, జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడం, మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై జూబ్లీహిల్స్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, ఈ ప్రతికూలతలను వెనక్కి నెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ ఎన్నికల్లో వెనకబడిందని క్షేత్రస్థాయిలో స్పష్టమవుతోంది. ఈ ఉప ఎన్నికలను జూబ్లీహిల్స్ వరకే పరిమితం చేస్తే కాంగ్రెస్ కి గెలుపు సులభమయ్యేది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారంలోకి దిగే సరికి అది ప్రభుత్వంపై ప్రజా తీర్పులాగా మారిపోయింది. ఈ తప్పిదం వల్ల ఎన్నికలు కేవలం నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత అవ్వకుండా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారాయి.
‘జూబ్లీహిల్స్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలి? అని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ‘‘మాకు నెలకు రూ.2500 ఇస్తానని ఇవ్వలేదు. వృద్ధుల ఫించన్ రూ.4000 పెంచుతామని మోసం చేశారు’’ అని ఎర్రగడ్డలో సరితా అనే మహిళ చెప్పింది. అన్ని డివిజన్లలోనూ కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. ‘‘జాబ్ నోటిఫికేషన్లు లేవు. హైడ్రా భయం వెంటాడుతోంది. అందుకే కాంగ్రెస్వైపు చూడటం లేదు’’ అని షేక్పేట్ లో రాజు అనే నిరుద్యోగి చెప్పారు. నల్లా బిల్లులు కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఎస్పీఆర్ హిల్స్ లో నగేశ్ అనే వ్యక్తి తనకు 21 వేల రూపాయిల నల్లా బిల్లు వచ్చిందని చూపించారు. హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 25 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏకంగా వేల రూపాయల బిల్లులు వేస్తున్నారని నగేశ్ వాపోయారు. ఇదే ప్రాంతానికి చెందిన బాలస్వామి అనే వ్యక్తి తనకు వచ్చిన 15,233 రూపాయిల బిల్లు వచ్చినట్లు చూపించారు.
ఇది కూడ చదవండి-
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గల్లీలో ఇళ్ల ముందు రెండు, మూడు ఆటోలు కనిపించాయి. ముఖ్యంగా ముస్లిం బస్తీల్లో ఎక్కువ ఆటోలు ఉన్నాయి. ఉచిత బస్సు వల్ల వీరికి ఉపాధి పోయింది. ‘‘ఫ్రీ బస్సు వల్ల మా గిరాకీ తగ్గింది. దీనికి తోడు ఏడాది రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది’’ అని రెహమత్ నగర్ లో రహీం అనే ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో డ్రైవర్లంతా కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఎక్కడ చూసినా తమకు రూ.2500 ఇవ్వలేదనే అసంతృప్తి మహిళలో కనిపిస్తోంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ పంచిన ‘బాకీ కార్డులు’ దీనికి మరింత ఆజ్యం పోశాయనే చెప్పాలి. కొన్ని చోట్ల ప్రజలు బీఆర్ఎస్ పంచిన కాంగ్రెస్ బాకీ కార్డులు చూపిస్తూ ఆరు గ్యారెంటీల ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు ప్రచారంలో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.
క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులను పసిగట్టిన కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు ఫ్రస్టేషన్ స్పష్టంగా కనపడుతోంది. ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన అజారుద్దిన్ కి హడావుడిగా మంత్రి పదవి ఇవ్వడం, సుదర్శన్ రెడ్డిని సలహాదారుగా నియమించడం, ప్రేమ్ సాగర్ రావు కి కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టడం, పెండింగ్ డీఏలు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయడమే దీనికి నిదర్శనం. అజారుద్ధిన్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనారిటీలను ఆకర్షించవచ్చు అనుకోవడం భ్రమే అవుతుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సచివాలయం వద్ద 125 అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, అనంతరం ఏపీలో జగన్ సర్కార్ కూడా భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ చర్యలు ఆ రెండు పార్టీలను గట్టెక్కించలేకపోయాయనేది ప్రస్తుతం గమనార్హం.
రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ పథకాలు కాంగ్రెస్ పార్టీకి మైలేజీ తీసుకొచ్చినా వీటిని ప్రచారం చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే స్కీములు కట్ అవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం కూడా నెగిటివ్ అయ్యింది. ‘‘ఒక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకు కోత పడుతాయా..? వచ్చే మూడేళ్లు వీళ్లే కదా అధికారంలో ఉండేది? ఈ పరిణామాలను చూస్తే ఇవన్నీ ఫ్రస్టేషన్ తో అంటున్న మాటలే ’’ అని స్థానికంగా ఉండే ఒక లెక్చరర్ వ్యాఖ్యానించారు. తెలుగునాట ఒక ఉప ఎన్నిక కోసం ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు అన్ని డివిజన్లలో తిరిగి ప్రచారం చేయలేదు.1996లో పాతపట్నం ఉప ఎన్నికలో లక్ష్మీ పార్వతి పోటీ చేసినప్పుడు.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి 15 నిమిషాలకు ఒక వీఐపీ ఆయా గ్రామాల్లో పర్యటించినట్టు వార్తలు వచ్చేవి. అయినా అక్కడ తెలుగుదేశం ఓడిపోయి లక్ష్మీపార్వతి గెలిచారు. 2021 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ని అసెంబ్లీలో చూడొద్దనుకుని, తన మంత్రులను క్షేత్రస్థాయిలో మోహరించారు. దళిత బంధు పథకం తీసుకొచ్చారు. కానీ, దళిత బంధు ఇచ్చిన గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ కి తక్కువ ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ లో అజారుద్ధిన్ తో పాటు ఇతరులకు పదవులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పునే రిపీట్ చేశారు.
2019లో ఎన్నికల ముందు పసుపు కుంకుమ కింద అందరికీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదలకు నష్టపరిహారం కింద అధికశాతం మంది ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు పంచింది. కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి దారుణంగా మెజారిటీ తగ్గిపోయింది. కాబట్టి, ఎన్నికల సమయంలో ఆయా వర్గాల నాయకులకు పదవులు ఇవ్వడం ద్వారా ఆ వర్గాల ఓట్లు వస్తాయనుకోవడం భ్రమే అవుతుంది. ముస్లిం సెంటిమెంట్లో 50 శాతం పైగా మద్దతు ప్రతిపక్ష బీఆర్ఎస్ కే ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో స్పష్టమవ్వడమే దీనికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మా బలం అభ్యర్థే అని భావిస్తోంది. అయితే నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారనేది వాస్తవం. రేవంత్ రెడ్డి ప్రచారంతో నవీన్ యాదవ్కు బలం పెరుగుతుందని భావించినా… రేవంత్ రెడ్డి ప్రభావం చూపేంత పెద్ద నాయకుడేం కాదని గత ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఆయన సీఎం అయ్యాక సొంత నియోజకవర్గం కొడంగల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు తగ్గగా… కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి 0.5 శాతం ఓట్ల తేడాతో ఎంపీగా ఓడిపోయారు. పరోక్షంగా సీఎం నియోజకవర్గమే కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. సీఎం అవడానికి ముందు ఆయన ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్ గిరి స్థానంలో బీజేపీ గెలిచింది. ఆయన సొంత జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ గెలిచింది. ఆయన సీఎం అయ్యాక బీజేపీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ఎమ్మెల్సీలుగా గెలిచారు. రేవంత్ రెడ్డి ప్రభావం జూబ్లీహిల్స్ లో ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ఇవే కొన్ని తార్కణాలు.
ఆంధ్రప్రదేశ్లో గతంలో పాస్ బుక్కుల మీద జగన్ బొమ్మలు వేస్తే.. తమ భూములు దోచేస్తాడని ప్రజలు భయపడినట్టే.. ఇప్పుడు హైడ్రా ని చూస్తే రేవంత్ రెడ్డి తమ ఇండ్లు కూలగొడ్తాడు, భూములు లాగేసుకుంటాడనే భయం ప్రజల్లో ఏర్పడిరది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక హామీలు ఇచ్చింది. ఐటీ ఉద్యోగుల భద్రత కోసం కొత్త చట్టాన్ని రూపొందిస్తామన్నారు. హైదరాబాదులో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారిస్తామన్నారు. కానీ, ఇవేం చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. రాజధానిలో అతిముఖ్యమైన రోడ్ల పరిస్థితి ఆధ్వాన్నంగా మారాయి. చిత్రపురి కాలనీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి, నిజమైన చలనచిత్ర కార్మికులకు న్యాయం చేస్తామన్న వాగ్దానం ఇంతవరకు నెరవేరలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చిత్ర కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వాగ్దానం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారింది. ‘‘నాలాల ఆధునీకరణలో హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కానీ, చిన్న చినుకుకే నగరం మునిగిపోతుంది’’ అని బోరబండలో కలిసిన మల్లేశ్ అన్నారు.
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అగ్రనాయకుడు హరీశ్ రావు తండ్రి చనిపోవడం వల్ల ఆయన ప్రచారంలోకి రావడం లేదు. దీంతో ప్రచారం అంతా కేటీఆర్ మీదే భుజ స్కందాలపై పడిరది. ఇది బీఆర్ఎస్ కి మైనస్. అలాగే, గోపినాథ్ ఇప్పటికే అక్కడ మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందడం వల్ల సాధారణంగానే కొంత వ్యతిరేకత ఉన్నది. అయితే, గోపినాథ్ పిల్లలు ఇప్పటికే రెండుసార్లు ప్రచారం పూర్తి చేయడం ఆ పార్టీకి కలిసి వస్తుంది.
బీజేపీ ఈ ఎన్నికల్లో మొత్తానికే కాడెత్తేసింది. అభ్యర్థి ఎంపిక నుంచి తప్పిదాలే చేసింది. ఈ ఎన్నికపై ఆసక్తి ఉన్నట్టు ఆ పార్టీలో కనిపించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ ఉన్నప్పటికీ.. అక్కడ వాళ్లకు ఆరు నుంచి ఏడు శాతం ఓట్లే వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే 7 నుంచి 8 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీకి అది కమ్బ్యాక్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం అవుతుంది. బీజేపీకి కనువిప్పు కలుగుతుంది!
– పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ (From Social Media)
