హైదరాబాద్ : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలుగు భాష- ఆధిపత్యాలు’ అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సు విజయవంతమైంది.
తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ… “ప్రాచీన కాలం నుంచి తెలుగు భాష, సాహిత్యాల స్థితిగతులు, ఇతర భాషలను స్వీకరిస్తూనే ఆయా భాషల ఆధిపత్యానికి లోను కాకూడదు” అన్నారు.
తెలుగు భాషా- ప్రసార మాధ్యమాలు – అంశంపై ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ… “సమాజం అభివృద్ధి చెందిన కొద్దీ ఆ సమాజం మాట్లాడే భాష కూడా వృద్ధి చెందాలి. భాషా వ్యవహర్తల అభివృద్ధితోనే భాషాభివృద్ధి జరుగుతుంది. ఇంగ్లీష్ మాట్లాడే వారు అభివృద్ధిలో ముందున్నారు గనుక ఇంగ్లీష్ కు ప్రాధాన్యత పెరిగింది” అన్నారు.
తెలుగు – వివిధ భాషలు అంశంపై డాక్టర్ నలిమెల భాస్కర్ మాట్లాడుతూ… “దక్షిణాదిన తమిళ ప్రజాలకు మాతృభాషాభిమానం ఎక్కువ. తెలుగు వారికి అది లేకపోవడం వల్ల మన మాతృభాషకు నష్టం కలుగుతున్నది” అన్నారు.
తెలుగు భాష -సాహిత్య ప్రభావం అన్న అంశంపై మాట్లాడిన ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… “సంస్కృత, ప్రాకృత ప్రభావాలతో తెలుగు భాష విస్తరించింది. మాతృభాష పద ప్రయోగం లేకపోవడం వల్ల నిందార్థంలో వాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులు ఇష్టపడుతూ తెలుగు భాషా వికాసం గురించి మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇంటర్మీడియట్లో సంస్కృతం చదువు ఎనిమిదో వింతగా మారింది” అన్నారు.
భాషాధిపత్యాలు – ఉద్యమాలు అంశంపై డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ… “ఆధిపత్యం హద్దు మీరినప్పుడు ఉద్యమాలు పుట్టుకొస్తాయి. భాషా పరిరక్షణలో ప్రజలు తమ అస్తిత్వం వెతుక్కుంటారు” అన్నారు.
తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ సదస్సు లక్ష్యాన్ని ప్రాసంగీకతను వివరించారు. తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో తెరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్, రచయితలు శ్రీ రామోజు హరగోపాల్, దాసరి మోహన్, దాసోజు పద్మావతి, విద్యావతి, రచ్చ సుమతి, బడే సాబ్, మేక రవీంద్ర రాపోలు సుదర్శన్, తూర్పు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.