హైదరాబాద్ : ఇప్పుడు రైతు అంటే కేవలం అన్నదాత మాత్రమే కాదు.. విద్యుత్ దాత, ఇంధన దాత, పవన విద్యుత్ దాత, బిట్యుమిన్ దాత, హైడ్రోజన్ దాతలుగా మారారు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి ఈ రోజు సిర్పూర్ కాగజ్ నగర్ బహిరంగ సభలో నితిన్ గడ్కరీ ప్రసంగంచారు.
Also Read-
కేంద్ర మంత్రి ఈ రోజు సిర్పూర్ కాగజ్ నగర్ బహిరంగ సభలో నితిన్ గడ్కరీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా దేశంలోని పేదలకు సేవలందిస్తున్నాం.
- నా నియోజకవర్గంలో చాలా వరకు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంటాను.
- ఇప్పుడు రైతు అంటే కేవలం అన్నదాత మాత్రమే కాదు.. విద్యుత్ దాత, ఇంధన దాతగా, పవన విద్యుత్ దాత.. బిట్యుమిన్, హైడ్రోజన్ దాతలుగా మారారు.
- అలాంటి వారందరినీ పైకి తీసుకువచ్చేందుకు నా చేతనైన సాయం చేస్తుంటాను.
- విదర్భలో రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు మేం అమృత్ సరోవర్ కింద చెరువులను నిర్మించాం, పంటలకు నీటిని అందించాం.
- అలా మీరు కూడా తెలంగాణలో నీటిని నిల్వ చేసుకుని, రైతులకు, భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలని కోరుతున్నాను.
- చెరువులు, కుంటలు, డ్యాంలలో ఉచితంగా పూడిక తీసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాం.
- మహారాష్ట్రలోని వాసిం జిల్లా, గడ్చిరోలి జిల్లాలను దత్తత తీసుకున్నాను. ఆయా జిల్లాల్లో రైతులు, యువతకు అనేక రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగుపరిచేందుకు మేం కృషి చేస్తున్నాం.
- తెలంగాణలో కూడా జల సంరక్షణ విషయంలో కృషి చేసి, రైతులకు మేలు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాను.
- జల సంరక్షణలో ముందుడుగు వేస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గి, గ్రామాలు సమృద్ధంగా, సంపన్నంగా తయారవుతాయి.
- నేను ముంబైలో మంత్రిగా ఉన్న సమయంలో వర్లీ-బాంద్రా సీలింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యే అదృష్టం నాకు దక్కింది.
- అప్పుడు నా వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. అదే సమయంలోనే అటల్ బిహారీ వాజపేయి గారు నన్ను పిలిచి.. గ్రామాలను అనుసంధానం చేసేందుకు పథకం తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు. దీంతో 6 నెలల పాటు కష్టపడి నివేదిక అందించాను.
- 15 రోజుల్లోనే ఎర్రకోట వేదికగా మా నివేదిక ఆధారంగా ప్రధానమంత్రి గ్రామ సఢక్ యోజనను ప్రకటించారు.
- దేశంలోని ఆరున్నర లక్షల గ్రామాలకు గాను 6.4 లక్షల గ్రామాల్లో అద్భుతమైన రోడ్లు నిర్మించేందుకు ఈ పథకం నాంది పలికిన విషయం తెలిసిందే.
- అమెరికా ధనిక దేశం కాబట్టి అమెరికా రోడ్డు బాగోలేవు.. అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా ధనిక దేశం అయిందని అమెరికా మాజీఅధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అనేవారు.
- అందుకే తెలంగాణలోని రోడ్లను మెరుగుపరిచి, ఇక్కడి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించి, వీరు సమృద్ధంగా తయారయ్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తోంది.
- 2014లో తెలంగాణలో 2511 కి.మీ. మేర జాతీయ రహదారులు ఉండేవి. గత పదేళ్లలో 5 వేల కి.మీ.కు పెరిగాయి.
- ఇప్పటివరకు 1.25లక్షల కోట్ల రూపాయలతో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేశాం.
- తెలంగాణలో రానున్న మూడు, నాలుగేళ్లలో ఏకంగా 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నాం.
- ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుందని నాకు నమ్మకం ఉంది.
- తెలంగాణ అభివృద్ధికి మేం కట్టబడి ఉన్నామని మరోసారి చెబుతున్నాను.
- 2014 కన్నా ముందు తెలంగాణలో మారు మూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే కనీసం 12 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఏ మూల నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా 4, 5 గంటల్లోనే చేరుకునేలా రోడ్లు నిర్మించాం.
- ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లోని ఏ మారుమూల గ్రామం నుంచి అయినా హైదరాబాద్ వరకు రాకపోకలు ఇప్పుడు సులభతరం అయ్యాయి.
- తెలంగాణలోని జాతీయ రహదారులకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు పలు ప్రాజెక్టులు ఇప్పటికే రూపొందించాం. వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని పనులు జరుగుతున్నాయి.
- కొత్త గ్రీన్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్లనుంది. 770 కి.మీ. మేర ఈ ఇండోర్-హైదరాబాద్ కారిడార్ నిర్మిస్తున్నాం.
- తెలంగాణలో ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ కారిడార్ పనులు మొత్తం పూర్తికానున్నాయి.
- తెలంగాణలో కామారెడ్డి-మెదక్-సంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్ వరకు ఈ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఇండోర్ నుంచి హైదరాబాద్ కు కేవలం 10 గంటల్లోనే చేరుకోవచ్చు.
- కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడూ అడుగుతుండే వారు.
- సూరత్ నుంచి నాసిక్-అహ్మద్ నగర్, సోలాపూర్ కర్నూల్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి వరకు సులువుగా చేరుకునేలా కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ కలలు నిజం అవుతాయి.
- ఈ ప్రాజెక్టులో భాగంగా 1,100 కి.మీ. మేర కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్తుంది.
- సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు 221 కి.మీ. మేర రూ.8 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నాం.
- హైదరాబాద్-విశాఖపట్నం హైవేను తెలంగాణలో రూ.6,040 కోట్లతో 164 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
- దీంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం దాదాపు 60 కి.మీ. మేర తగ్గనుంది.
- ఆరు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు.
- 565 కి.మీ. మేర 16 వేల కోట్ల వ్యయంతో నాగ్‌పూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 30 శాతం పనులు పూర్తయ్యాయి.
- తెలంగాణలో 401 కి.మీ. మేర రూ.13,300 కోట్లతో ఆసిఫాబాద్-మంచిర్యాల-భూపాలపల్లి-హన్మకొండ-వరంగల్-ఖమ్మం మీదుగా ఈ కారిడార్ వెళ్లనుంది.
- ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు 175 కి.మీ. దూరం తగ్గుతుంది. దీంతో విజయవాడకు 6 గంటల్లోనే చేరుకోవచ్చు.
- ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అనేక జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులతో తెలంగాణలో పర్యాటకం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను.
