హైదరాబాద్: రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ (ఏఐఎంఈపి) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు నౌహీరా షేక్ ప్రకటించారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకుడు జాన్ మస్క్ తో కలిసి తొలి జాబితాను విడుదల చేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి తాను స్వయంగా పోటీ చేస్తున్నానని తెలిపారు. చేవెళ్ల నుంచి ఇమామ్ హుస్సేన్, వరంగల్ నుంచి నవ్య, ఖమ్మం నుంచి శామ్యూల్, మెదక్ నుంచి రామచందర్లు బరిలో ఉంటారని నౌహీరా తెలిపారు. మతాలకతీతంగా ఆధ్యాత్మిక చింతనలో కొనసాగుతున్న వ్యక్తులకు పార్టీ నుంచి టికెట్లు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇతర పార్టీలలో లాగా ప్రజలను మభ్య పెట్టబోమని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పరిమితిలోనే అభ్యర్థులు ఖర్చు చేస్తూ ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రత్యామ్నాయ పార్టీలకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తామని అన్నారు.