సిఎం, మంత్రివర్గ నిర్ణయాన్ని శాసన సభ, మండలి పున: సమీక్షించాలి
పాలకుర్తి: తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుని పేరే పెట్టాలని, సోమనాథ కళా పీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసింది. శాసన సభలో బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసన సభ్యులంతా ఈ విషయమై చొరవ తీసుకుని చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని ముందుగా శాసనసభలో ప్రస్తావించారు. పలువురితో చర్చించి ఏకాభిప్రాయంతో పేరు ఖరారు చేస్తామన్నారు. కానీ ఏకపక్షంగా సురవరం ప్రతాపరెడ్డి పేరును మంత్రివర్గంలో తీర్మానించారు. బిల్లు కూడా పెట్టారు. సోమనాథుని పేరు పెట్టాలని వచ్చిన అనేక విజ్ఞప్తులను మంత్రి వర్గం పట్టించుకున్నట్లు లేదు. తెలంగాణ మలిదశ ఉద్యమం నాటి నుంచీ తెలంగాణ వాదులు ఈ విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని బలంగా కోరుతున్నారు.
Also Read-
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చటానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి మంత్రి వర్గ నిర్ణయాన్ని మళ్ళీ సమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకోగలరని పీఠం విశ్వాసం వ్యక్తం చేసింది. సురవరం ప్రతాపరెడ్డి పేరును పాలమూరు విశ్వవిద్యాలయానికి, మీడియా అకాడమీ కి పెట్టవచ్చునని సూచించింది. సాహిత్యాభిమానులు, సబ్బండ వర్గాలు, సమస్త రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి తెలియ చెప్పి తెలుగు విశ్వవిద్యాలయానికి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టించాలని పీఠం పిలుపు నిచ్చింది.
ఈ విజ్ఞాపన వెంట సిఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సభ్యులకు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి కి, ఆయా శాఖల కార్యదర్శులకు పంపిన విజ్ఞప్తులతో పాటు, వివిధ సాహిత్యకారులు, చరిత్రకారులు, ప్రముఖులు రాసిన వ్యాసాల ప్రతులు, పీఠం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులు చేసిన తీర్మానాలు, వచ్చిన వార్తల క్లిప్పింగులు జత చేశారు.