CM KCRకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ, విషయం…

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.
నమస్కారం…

విషయం : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ….

గత 6 రోజులుగా రాష్ట్రంలోని 9350 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్న విషయం మీకు తెలిసిందే. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ అత్యంత సమంజసమైనది. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండదని అసెంబ్లీ సాక్షిగా మీరే ప్రకటించారు. నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం నాడు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ పోటీ పరీక్షల్లో రాసి అర్హత సాధించి ఉద్యోగంలో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీ కాలం పూర్తయి నాలుగేళ్లు దాటినా వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించినప్పటికీ అన్నింటినీ భరిస్తూ విధులు నిర్వర్తించారు. గడువు దాటినా నేటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణం.

పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివృద్ధి వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకుంటున్న ప్రభుత్వం అందులో కీలక పాత్ర వహిస్తున్న ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం అన్యాయం. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులైన నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, కిచెన్ గార్డెన్ లతోపాటు పల్లె ప్రగతి, హరితహారం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమలులో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర క్రియాశీలం.

రోజుకు 12 గంటలకుపైగా పని చేస్తున్న వీరితో వెట్టిచాకిరి చేయించుకున్నారే తప్ప నేటికీ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణం. పైగా రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులకు, వీరికి మధ్య వైరం పెట్టేలా మీ చర్యలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రామానికి వెన్నుముకలైన సర్పంచుల్లో కొందరు చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రొబేషనరీ కార్యదర్శులు సమ్మె చేసే దుస్థితి రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం.

మీరు మాత్రమే శ్వేత సౌధంలో సేద తీరితే సరిపోదు. ప్రజల, ఉద్యోగుల బాగోగులను పట్టించుకోండి. ఇకనైనా మొద్దునిద్ర వీడి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. లేనిపక్షంలో తెలంగాణ సమాజం క్షమించదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయా ఉద్యోగాలను క్రమబద్ధీకరించండి. లేనిపక్షంలో ఆయా ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదని బిజెపి తెలంగాణ శాఖ పక్షాన హెచ్చరిస్తున్నాం.
భారత్ మాతాకీ జై…

బండి సంజయ్ కుమార్, ఎంపీ,
అధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X