మోదీ, కేసీఆర్ బ్రాండ్లకు కాలం చెల్లింది
బీజేపీ భాషనే కేసీఆర్ మాట్లాడుతున్నారు
బండి చెప్పిందే.. కేసీఆర్ చెప్పారు!
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే
కర్ణాటక తీర్పు దేశానికి దశ, దిశ నిర్ణయించేది
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు
బీసీ జనాభాను ఎందుకు లెక్కించడం లేదు
త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ డిక్లరేషన్
కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి
కేసీఆర్ ను ఓడించడం బీజేపీతో కాదు
రూ. 200 కోట్ల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలా?
కేసీఆర్ కు ఇవే చివరి అవతరణ వేడుకలు
వచ్చే వేడుకలు కాంగ్రెస్ నేతృత్వంలో
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ బ్రాండ్లకు కాలం చెల్లిందని అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని చెప్పారు. కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందని తెలిపారు. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్ని నిలిచిన అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని కొనియాడారు. కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని మేథావులు, బుద్ధి జీవులు, సిద్ధాంతకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపును స్వాగతిస్తున్నారు. ఎడారిలో ఒయాసిస్సుగా మాదిరిగా కాంగ్రెస్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి వివరించారు. నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టాల్సిన అవసరం ఉందని, అవసరమైన మేరకు కాంగ్రెస్ తో పనిచేస్తామని మమతా బెనర్జీ చెప్పారని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న వాటిని పట్టించుకోకుండా ఏవిధంగానైనా కర్ణాటకలో గెలవాలనే ఉద్దేశంతో మోదీ, అమిత్ షా 20 రోజులు ప్రచారం చేశారు. మోదీతో సహా కేంద్ర మంత్రులంతా కర్ణాటకలో మోహరించారు. జై భజరంగబలి, హిజాబ్ వంటి అంశాలతో మత విద్వేషాలు, లింగాయత్ ల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య విద్వేషాలు రగిలించి కుట్ర పూరితంగా గెలవాలని ఒత్తిడి తెచ్చారు.
మోదీ, షా కుట్రలను తిప్పికొట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలని మోదీని ఓడించేందుకు అందరూ కలిసి వచ్చారు. ఈ అద్భుతమైన తీర్పును ప్రపంచం అభినందిస్తుంటే కేసీఆర్ మాత్రం గెలుపు గురించి ఆలోచించాల్సిన పనిలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
Telangana Congress president @revanth_anumula invites those fighting against #KCR to join Congress. Willing to take two steps down, he said. "Telangana can't bear #KCR anymore." pic.twitter.com/a7v4I64sO5
— Lutyens Media (@LutyensMediaIN) May 18, 2023
తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తాము ఎలాంటి సానుకూల స్పందన ఆశించడంలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా తాము కోరుకోవడంలేదని తెలిపారు. కానీ, కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించి, ప్రజలు ప్రజస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకునే మాటను కేసీఆర్ అనుంటే ఎవరైనా ఆయను అభినందించేవారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనను అభినందించకపోయినా కనీసం తిట్టుండే వాళ్లు కాదని తెలిపారు. మోదీని ఓడిస్తానని కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కర్ణాటకలో హంగ్ తీసుకురావాలని కేసీఆర్ చేసిన కుట్రలను మేం బయటపెట్టామని రేవంత్ రెడ్డి అన్నారు.
“కర్ణాటకలో ఫలితాలు వచ్చిన మొదటి రోజే బండి సంజయ్ ఏం చెప్పాడో చూడండి… కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నాడు. కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపించవన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అన్నాడు. బండి సంజయ్ ఈ మాటలు చెప్పిన నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ కూడా ఇవే మాటలు చెప్పాడు. కర్ణాటక ఫలితాల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు. అక్కడ మోదీ ఓటమిని గుర్తించడానికి కూడా కేసీఆర్ కు మనసొప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే… బీజేపీ భాషను, బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ స్పష్టంగా సమర్థించాడు.
ఇన్నాళ్లూ కేసీఆర్ ఏంచెప్పాడు… మోదీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు, మోదీపై కొట్లాడతాం అన్నాడు. మోదీకి ఎదురొడ్డి నిలుస్తాం అని చెప్పిన విధానానికి, నిన్న ఆయన మాట్లాడిన విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ మాటలను ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ సమాజం దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కర్ణాటకలో బీజేపీ చేసిందే తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం కంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్ తీసుకుంటే ఇక్కడ కూడా కేసీఆర్ కంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నాడు. బీజేపీ, బీఆరెస్ ఒకే తాను మొక్కలు మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే బీజేపీ, బీఆర్ఎస్ విడిపోయినట్లు నతకమాడుతున్నారు అని ఆయన అన్నారు. కర్ణాటకలో హంగ్ తీసుకొచ్చి కేసీఆర్ చక్రం తిప్పాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు కేసీఆర్ నడుములు విరిగే తీర్పు ఇచ్చారు. కర్ణాటక ప్రజల తీర్పు దేశానికి దశ, దిశ నిర్ణయించే తీర్పు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెతుకుని బతకాల్సి వచ్చేది. కుటుంబం పెద్దది కొంత మంది నాంపల్లి దర్గా దగ్గర మరికొంత మంది బిర్లా టెంపుల్ దగ్గర బిచ్చమెత్తుకుని బతికేవారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో అన్ని రకాల త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రజల కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని రేవంత్ రెడ్డి అన్నారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ పెరగడానికి పొత్తు పెట్టుకొని సీట్లు ఇచ్చి, 2006లో కేంద్రంలో కేసీఆర్ ను కేంద్ర మంత్రి చేసి, నాగార్జునసాగర్, శ్రీశైలం, జురాల వంటి ప్రాజెక్టులతోపాటు ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు వంటి అధునిక ప్రాజెక్టులతోపాటు మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీ ద్రోహమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీకి ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీల్లో రిక్రూట్ మెంట్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ వరకు రిజర్వేషన్లు కల్పించింది. కానీ వీపీ సింగ్ హయాంలో మండల్ కమిషన్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దానికి వ్యతిరేకంగా కమాండల్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ కదా అని రేవంత్ ప్రశ్నించారు. బీసీ జనాభాకు తగ్గట్టుగా నిధులు, అభివృద్ధి జరగాలంటే బీసీ జనగణన చేపట్టాలని కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకుంది.
ఇతర పార్టీలు ఇదే డిమాండ్ చేస్తున్నాయి. మరీ బీసీ జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోదీ చెప్పాలి. మోదీ ఒక్కరే ప్రధాని అయితే బీసీల కడుపు నిండినట్లు కాదని రేవంత్ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. ద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందిగా మరి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పదవి పోయే ముందు బీసీలు గుర్తొచ్చారా? అని ఎద్దేవా చేశారు. త్వరలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయబోతుందో బీసీ డిక్లరేషన్ రూపంలో వివరిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
వివేక్, ఈటల, రాజగోపాల్ రెడ్డి, విష్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు బీజేపీ సిద్ధాంతాలను నమ్మరు. వారిని బీజేపీ నమ్మదు. వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు. సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే… ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది. కేసీఆర్ ను ఓడించడం బీజేపీతో కాదు.. బీజేపీ, కేసీఆర్ వేరు కాదు. తెలంగాణ అభ్యున్నతికి పని చేయాలనుకునే వారు కాంగ్రెస్ తో కలిసి రండి అని రేవంత్ పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌కు ఓటమి అర్థమై తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలపై నెపం వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పేరిట రూ. 200 కోట్ల ప్రభుత్వ ధనంతో ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తారా అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలకు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1300 కోట్లు ఉన్నాయి. వాటిల్లోంచి ప్రకటనల కోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటే అభ్యంతరం లేదన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవి చివరి రాష్ట్ర అవతరణ వేడుకలు. తరువాత జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.