హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలాదా? ఇప్పుడు వాళ్లకు ప్లాట్లు కూడా లేకుండా చేస్తారా?
పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి?
బిల్డర్ల నుంచి స్వ్కేర్ ఫీట్ కు, పేద, మధ్యతరగతి ప్రజల నుంచి చదరపు గజానికి వసూళ్లా?
ఎవరో చేసిన తప్పునకు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లను బాధితులు చేస్తారా?
మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జీపీ లే అవుట్లు వందలాదిగా వెలిశాయి.
అప్పట్లో అనుమతించి ఇప్పుడు కాదంటే ప్లాట్లు కొన్న వాళ్లు ఏమై పోవాలి?
పేద, మధ్య తరగతి ప్రజలంటే రేవంత్ రెడ్డి కి ఎందుకంత కోపం?
హైదరాబాద్ : హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయితీ (జీపీ) లే అవుట్లలో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు బంద్ అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం నిజంగా మూర్ఖపు చర్యేనని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏమాత్రం పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పరిపాలన అనుభవం లేకుండా తుగ్లక్ ను తలపించేలా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చేసిన రేవంత్ రెడ్డి…ఇప్పుడు తాజాగా హెచ్ఎండీ పరిధిలో వరకు ఉన్న పేదలు, మధ్య తరగతిని టార్గెట్ చేశారన్నారు. వాళ్ల ఇళ్లు కూల్చేసిందని చాలదన్నట్లుగా ఇప్పుడు పేదలు, మధ్యతరగతి ప్రజల ప్లాట్లు పై కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్ఏండీఏ పరిధిలో ఉన్న జీపీ లే అవుట్లలో వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుక్కోవటం ప్రజల తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఎల్ ఆర్ ఎస్ ఉచితంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్లాట్లు ఎంతో మంది చేతులు మారాయని…ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు, ఇక మళ్లీ రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ల పరిస్థితి ఏమవుతుందని కేటీఆర్ నిలదీశారు. ప్రభుత్వమంటే ఏళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి…ఎన్నో ఏళ్లుగా లేని వాటిని ఇప్పుడు సమస్యలుగా సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read-
రేవంత్ రెడ్డి చేస్తున్న తుగ్లక్ పనులకు పేద, మధ్య తరగతి ప్రజలే సమిధలవుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో వేలాదిగా జీపీల్లో లే అవుట్లు వెలిశాయని వాటి క్రయ విక్రయాలు కూడా ఎంతో మంది చేతులు మారాయన్నారు. ఇప్పుడు వాటికి ఎవరినీ బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్ కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం పైసా, పైసా కూడబెట్టుకొని పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చెల్లవంటే వారి పరిస్థితి ఏం కావాలో చెప్పాలన్నారు. రెండు, మూడు దశాబ్దాల క్రితం తమ తాతాలు, తండ్రులు కొన్న ప్లాట్లను ఇప్పుడు చెల్లవన్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్లు ఎవరికీ చెప్పుకోవాలని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్డర్లను బెదిరిస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని…ఇప్పుడు వెంచర్ల యాజమానుల నుంచి కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసేందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్ల పేరుతో పేదలు, మధ్య తరగతి ప్రజలను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడని కేటీఆర్ అన్నారు. జీపీ లే అవుట్లలో గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమంటే పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులను ప్రభుత్వం లాక్కోవటమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఇదే మాట ఎల్.ఆర్.ఎస్ విషయంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు నేరుగా ప్రజలు కొనుక్కున్న ఆస్తులు చెల్లవని చెప్పడం వారి మోసపూరిత వైఖరికి నిదర్శనం అన్నారు. ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ఫ్రీ గా చేస్తామంటూ నమ్మబలికి…ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన వాళ్లను కూడా ఆగం చేసే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఎన్నికల నాటి హామీ ప్రకారం పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు ను రద్దు చేసిన గ్రామ పంచాయితీ లే అవుట్ల వెంచర్లలోనూ రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే బాధిత ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు