Hyderabad: ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ పరిధిలో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టవలసిన నియామకాల పునర్ వ్యవస్థీకరణ తదితర అభివృద్ధి కార్యాచరణ పై మంగళవారం నాడు ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ సెక్రటరీ శ్రీనివాసరాజు,ఈఎన్సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు,సి.ఈ సతీష్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల రోడ్లు భవనాలు శాఖకు సంబంధించి చేసిన పలు సూచనలు,ఆదేశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. శాఖలో పరిపాలన సంస్కరణలు అమలుకై ముఖ్యమంత్రి సూచించిన విధంగా సిద్దం చేసిన ప్రణాళికలను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న అధికారుల తమ పరిధిలోని దూరం ఎక్కువగా ఉన్నదన్నారు. దాన్ని అధిగమించి పనుల్లో వేగంతో పాటు పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండేలా సంస్కరణ చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా పూర్తి స్థాయి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా. బి. ఆర్ అంబేద్కర్ కొత్త సెక్రటేరియట్,తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిపై ఈ సందర్బంగా చర్చించారు. హైదరాబాద్ నగరానికి మణిహారంలా ఉండే ఈ కట్టడాల నిర్మాణం తుది దశకు చేరుకుందని,ఫినిషింగ్ వర్క్స్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. పనులు మూడు షిఫ్టుల్లో వేగంగా జరగాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో వర్క్ ప్రోగ్రెస్ పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు విధించిన గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కావాలని మంత్రి అధికారులను అదేశించారు.