యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున సింగరేణి ఉద్యోగులకు అందే బీమా ప్రయోజనాలు
హైదరాబాద్ : సింగరేణి ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు వినిపించింది. సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ. కోటికి పెంచింది రేవంత్ ప్రభుత్వం.
అయితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమాను 20 లక్షల నుంచి 40 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. సుమారు 43 వేల మంది కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకం వర్తించనుంది. అయితే.. ఇప్పటి వరకు కేవలం సైనికులకు మాత్రమే ప్రమాద బీమా కోటి రూపాయలు ఉండగా ఇక నుంచి సింగరేణి కార్మికులకు కూడా వర్తించనుంది.
ఈ మేరకు బ్యాంకర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. హైదరాబాద్ సచివాలయంతో బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజని అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర క్రియాశీలకమన్నారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.
హై లైట్స్
ఉద్యోగుల జీతంతో సంబంధం లేకుండా కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సదుపాయం (ప్రమాదంలో మరణం లేదా శాశ్వత పాక్షిక వైకల్యం, పూర్తి శాశ్వత వైకల్యం సంభవించిన పక్షంలో). యూనియన్ బ్యాంక్ డెబిట్ కార్డును నెలలో ఒక్కసారైనా వాడటం ద్వారా అదనంగా 15 లక్షల రూపాయల బీమా ప్రయోజనం.
ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా రూ. 1 కోటి 15 లక్షల ప్రమాద బీమా సదుపాయం సింగరేణి ఉద్యోగులకు అందుతుంది. అగ్ని ప్రమాదం జరిగి ప్లాస్టిక్ సర్జరీ లాంటి ట్రీట్‌మెంట్ అవసరమైన పక్షంలో రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం.
ప్రమాదంలో మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించేందుకు రూ. 20 వేల ఆర్థిక సహాయం. ప్రమాదంలో ఉద్యోగి చనిపోయే సమయానికి గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలు ఉన్నట్లయితే రూ.6 లక్షల ఆర్థిక సాయం.
ఎయిర్ అంబులెన్స్ అవసరమైన పక్షంలో 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఇద్దరు కుటుంబ సభ్యులు వెళ్లడానికి వీలుగా రవాణా ఖర్చుకింద రూ.20 వేల ఆర్థిక సాయం.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఏడాదిలో రూ. 15 వేల వరకు ఇన్ పేషెంట్ కవరేజ్ సదుపాయం. యూనియన్ బ్యాంక్ ఏటీఎంను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. దీనిపై ఎలాంటి రుసుం ఛార్జ్ చేయడం జరగదు.
ఎస్‌ఎంఎస్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలు కూడా ఉండవు. లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే మొదటి ఏడాది రెంట్ మీద 50 శాతం రాయితీ. రూ.25 లక్షల పైన గృహ రుణంపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు.
గృహ రుణం వడ్డీ పై 0.05 శాతం ప్రత్యేక కన్సెషన్. వాహన రుణాల వడ్డీ పై 010 శాతం ప్రత్యేక రాయితీ. విదేశీ విద్యాకోసం తీసుకునే రూ. 75 లక్షలకు పైగా రుణాలపై 0:10 శాతం రాయితీ. కుటుంబ సభ్యులు ముగ్గురు (జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు) జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేందుకు అవకాశం.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజీ కలిగిన సింగరేణి ఉద్యోగులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత పింఛన్ ఖాతాను యూనియన్ బ్యాంకులోనే కొనసాగించడం ద్వారా 70 ఏళ్ల వరకు ఈ బీమా సదుపాయం అందుతుంది.