అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య, పోడు భూముల వివాదం: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

విషయం : అటవీ అధికారి శ్రీనివాసరావు హత్య, పోడు భూముల వివాదం గురించి


తెలంగాణలో పచ్చని భూమిలో నెత్తురు పారుతోంది. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో మీ ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతోంది. ఈ క్రమంలోనే నిన్న కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని పోకలగూడెంలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు గుత్తికోయల దాడిలో హత్యకు గురికావడం చాలా దారుణం. మీ ప్రభుత్వ చేతగానితనంతో నిజాయితీ పరుడైన ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి రావడం చాలా బాధాకరం. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్యే. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలి.

గత ఎనిమిదేళ్లుగా మీరు పోడు భూములపై హక్కులు కల్పిస్తామని అటు లబ్దిదారులను ఊరిస్తూ, మరోవైపు అటవీ భూములను సేద్యం చేస్తున్నారని గిరిజనులపైకి అధికారులను ఎగదోస్తూ చోద్యం చూస్తున్నారు. మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అటవీ అధికారులు, గిరిజనుల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు, మూడేండ్లుగా పోడు భూముల్లో ఫారెస్ట్‌ ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు రావడం, గిరిజనులు అడ్డుకోవడం, ఈ క్రమంలో గొడవలు జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది గిరిజనులపై కేసులు పెట్టారు. అంతేకాకుండా కొంత మంది ప్రజాప్రతినిధులు సైతం అధికారులపై దాడులకు దిగారు. గతంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌, సిబ్బందిపై దాడి చేశారు. గతేడాది జూలై 2న నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారులో ఫారెస్ట్ సెక్షన్ అధికారి మధుసూదన్ గౌడ్ బృందం, భూపాలపల్లి రేంజి అధికారి కూడా దాడులకు గురయ్యారు.

2018లో గిరిజనుల ఓట్ల కోసం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. మెనిఫెస్టోలో కూడా చేర్చారు. ఎన్నికలు అయిపోగానే అన్ని హామీల మాదిరిగానే ఈ అంశాన్ని కూడా అటకెక్కించారు. పోడు రైతులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసినా మీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పేద ఆదివాసీలకు కూడా రైతుబంధు, రైతుబీమా రావాలి.. వాళ్లు బతకాలి.. వాళ్లూ మన బిడ్డలే ప్రజాదర్బార్లు పెట్టి.. పోడు భూమికి పట్టాలు ఇస్తాం అని అసెంబ్లీలో ప్రకటన చేసి మూడేళ్లు అయింది. పోడు సమస్య పరిష్కారానికి గతేడాది సెప్టెంబర్ 16న మంత్రి సత్యవతి రాథోడ్ చైర్పర్సన్గా ఒక కమిటీని నియమించారు. కమిటీని నియమించి దాదాపు 14 నెల్లయినా ఇంత వరకు అతీగతీ లేదు.

మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఆదిలాబాద్ నుంచి భూపాలపల్లి వరకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి నాగర్ కర్నూల్ దాకా ఏదో ఒక చోట అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య ఘర్ష ణలు నిత్యకృత్యమవుతున్నాయి. మీ నిర్లక్ష్యం కారణంగా ఒక అటవీ అధికారి ప్రాణాలు కోల్పోవడంతోపాటు గుత్తికోయలు జైలు కెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుత్తి కోయలు చేసింది ముమ్మాటికి తప్పే. అందుకు వారిని శిక్షించాల్సిందే. కానీ మీ ప్రభుత్వం పోడు భూములు అంశంలో ఎనిమిదేళ్లుగా చూపిస్తున్న నిర్లక్ష్యం క్షమించరానిది. మీ నిర్వాకం కారణంగా గిరిజనులు, ఆదివాసీలు, అధికారులు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి దాపురించింది. అధికారులు అభద్రతా భావంతో విధులు నిర్వహించాల్సిన దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. మరణించిన శ్రీనివాసరావు విషయంలో మీరు ఇచ్చిన హామీలు కంటితుడుపు చర్యలుగా ఉన్నాయి. శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 5 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకోవాలి.

తక్షణమే పోడు భూములకు పట్టాలిచ్చే కార్యాచరణను ప్రకటించాలి. ఈ లోపు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీల జోలికి వెళ్లకుండా అధికారులకు అదేశాలివ్వాలి. విధులు నిర్వహిస్తున్న అధికారులకు భద్రత కల్పించాలి. అటవీ అధికారుల డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. పోడు భూముల పేరుతో గిరిజనులు, అధికారుల మధ్య చిచ్చు పెట్టడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలి. లేని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తాం.

ఎ. రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి,
టీపీసీసీ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X