TPCC: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ, విషయం…

విషయం : ఏసీడీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం, పోలీసు లైసెన్స్ పేరుతో వ్యాపారుల పై భారం మోపడం గురించి…

మీ తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ పాలన, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణ కు ఒరిగింది శూన్యం. మీ కుటుంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాళా తీశాయి. మీ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారు. గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యూకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారు. మళ్లీ రెండు నెలల విద్యుత్ బిల్లులు డిపాజిట్ పేరుతో పేదవాడి జేబుకు చిల్లుపెట్టడానికి తయారయ్యారు. ఒక వైపు కరోనా, పెట్రోల్ – డీజిల్ – గ్యాస్ ధరల పెరుగుదల, నిత్యావసరాల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి కరువై, ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్య తరగతి వాడిపై దోపిడీకి తెగబడటం క్షమించరాని విషయం.

విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపభూయిష్టం

దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం… విద్యుత్ రంగంలో అద్బుతమైన ప్రగతి సాధించాం అని మీరు ఊరువాడ డబ్బాకొట్టుకుంటున్నారు. అదే నిజమైతే విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయి. ప్రభుత్వమే 20 వేల కోట్ల మేర బాకాయి పడిన మాట వాస్తవం కాదా!? చత్తీస్ ఘడ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపభూయిష్టం… దాని వల్ల తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినా మీరు పెడ చెవిన పెట్టారు. యాదాద్రీ–భద్రాద్రీ లాంటి ప్లాంట్ల నిర్మాణంలో కాలం చెల్లిన సాంకేతికతను వినియోగిస్తున్నారు… దాని వల్ల భారం తప్ప ప్రయోజనం లేదని గొంతు చించుకున్నా మీరు వినలేదు. కారణం తెలియంది కాదు.

మీ కమీషన్లు, మీ కుంభకోణాల కోసమే ఈ ఒప్పందాలు

మీ కమీషన్లు, మీ కుంభకోణాల కోసమే ఈ ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు అన్నది జగద్విదితం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా నిర్మాణం ప్రారంబించి… పూర్తి చేసిన ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా లేదు. బహిరంగ మార్కెట్ లో అడ్డగోలు ధరలకు కరెంటు కొని ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. అదేదో మీ ఘనత అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.

మీ దివాళా తీసిన ఖజానా నింపుకోవడానికి పోలీసుల జోక్యం

ఇక తాజాగా రాష్ట్రంలో వ్యాపారస్తుల పై మీ దృష్టి పడింది. వీధి వ్యాపారి నుండి మధ్య తరగతి వ్యాపారి వరకు ఇప్పటికే వివిధ ట్యాక్సులు, లైసెన్సుల పేరుతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవాలంటే పోలీసు లైసెన్స్ తప్పని సరి అని నిబంధన తెచ్చారు. దీనికి గాను కనీసం రూ.1000 నుండి రూ.15 వేల వరకు ఫీజు చెల్లించాలని హుకూం జారీ చేశారు. కరోనా దెబ్బతో వ్యాపారాలు దెబ్బతిని, అప్పుల పాలై ఇబ్బందులు పడుతోన్న చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఇది భారం. మీ దివాళా తీసిన ఖజానా నింపుకోవడానికి పోలీసుల జోక్యంతో వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.\

వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకుంటుంది

ఈ నేపథ్యంలో విద్యుత్ విషయంలో ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. అలాగే, వ్యాపారాల నిర్వహణకు పోలీసు లైసెన్స్ తప్పని సరి నిబంధనను సైతం తక్షణం ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకుంటుంది. గతంలో విద్యుత్ ఛార్జీలపై జరిగిన పోరాటాలు మీరు తెలియంది కాదు. బషీర్ బాగ్ లాంటి చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు మన కళ్లముందే ఉన్నాయి.

వామపక్ష పార్టీలకు విజ్ఞప్తి

ఈ సందర్భంగా వామపక్ష పార్టీలకు కూడా నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్న మీరు పేదలపై పడుతోన్న ఈ భారాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో కేసీఆర్ పాపంలో మీరు కూడా భాగస్వాములవుతారు.

ఎ. రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి,
టీపీసీసీ అధ్యక్షుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X