• కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన టీపీసీసీ రేవంత్ రెడ్డి
• రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం
• తనను అన్యాయంగా జైల్లో పెట్టారని
• ఆ ఉసురు తగిలి కవిత ఇంటికి సీబీఐ వచ్చిందని ఆక్షేపణ
Hyderabad: “2015లో నన్ను ఆరోజు అన్యాయంగా జైల్లో పెట్టారు. నా బిడ్డ లగ్నపత్రికకు కూడా పోకుండా చేశారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది. ఆ పాపం ఊరికే పోదు. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వస్తే ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది అని” టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై కాంగ్రెప్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులు మన భాష, యాస మీద దాడి చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించేవారు. కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన కల్చర్ అయిన అగ్రికల్చర్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి చేస్తుందని అగ్రహం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. మళ్లీ రైతులను కూలీలుగా మార్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు బీమా ఇస్తున్నామమి గొప్పలు చెప్పుకుంటున్నా కేసీఆర్ పంట నష్టానికి బీమా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పంట బీమా ఇవ్వని కేసీఆర్ రైతు చావులకు వెలకడుతున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ మంత్రి లెక్కల ప్రకారం 80 వేల మంది రైతులు చనిపోయారు. అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు లక్ష మంది రైతులు చనిపోయారు. అంతమంది రైతులను పొట్టన బెట్టుకున్న కేసీఆర్ సీఎంగా కొనసాగడానికి వీల్లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ.. అన్నదాతను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ, టీఆర్ఎస్‌లు కలిసి రాష్ట్రంలో కుట్రలకు తెరలేపారని అన్నారు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంలో తీహార్ జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తుంటే కేంద్రాన్ని అడ్డుకునే వారు ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. 8 ఏళ్లుగా కలిసి కాపురం చేసి ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నాటకాలాడుతున్నాయి. మోదీ తెచ్చిన నల్లా వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చారు. ఆ నల్లా చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, 16 నెలలపాటు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేశాయి. మేము నల్ల చట్టాలను రద్దు చేయిస్తే వాటికి మద్దతిచ్చింది నీవు కాదా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. రాష్ట్ర పెట్టుబడులను గుజరాత్ కు తరలించుకుపోవాలని కుట్ర చేస్తున్నాడు. ఇక్కడ వ్యాపారస్తుల మీద జరిగే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు గుజరాత్లో ఎందుకు లేవు అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డిని కోనుగోలు చేసిందే నువ్వే కదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. “మా తాండూర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన దరిద్రుడు నువ్వే కదా ?, 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కూడా నువ్వే కదా ? ఇప్పుడేమో వగల ఏడుపు ఏడుస్తున్నావు. కాంగ్రెస్‌ను లేకుండా చేస్తే కేటీఆర్‌కు తిరుగుండదని కేసీఆర్ కుట్రలకు తెరలేపారు. ఆ పాపం ఊరికే పోదు. నీ పార్టీ చీలికలు పేలికలుగా సర్వనాశనమైపోతుంది. మా కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు కేసీఆర్‌కు తప్పకుండా తగలుతుంది. ఇవన్నీ చూసి కృంగి కూషించిపోతాడు కేసీఆర్” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ రేవంత్ రెడ్డి.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణను ఎదుర్కొవడానికి బీజేపీ నేత బీఎల్ సంతోష్ భయపడుతున్నారు. ఏ తప్పు చేయకుంటే విచారణ హాజరుకాకుండా స్టే ఎందుకు తెచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కవిత ఎందుకు విచారణకు హాజరు కావడం లేదు.
పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్టును అడ్డుకుంది నీవు కాదా కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా నది జలాలకు ఆంధ్ర సీఎం జగన్ అడ్డుపడుతుంటే గోదావరి జలాలకు అడ్డువచ్చిందెవరు. అసలు కట్టని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 70 శాతం పూర్తయింది అనడం కేసీఆర్ దివాళకోరుతనానికి నిదర్శనం అన్నారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా మెదక్ జిల్లాకే పరిమితం చేసిన పాపం కేసీఆర్ ది కాదా. తెలంగాణలో ఎపుడైనా ఎన్నికలు రావొచ్చు. కేసీఆర్ ఎన్నికల కోసం తొందరపడుతున్నారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఇక కేసీఆర్ ముందు డిమాండ్స్ పెట్టేది లేదని అన్నారు. ఎవరి ఇంటి ముందుకెళ్లి బిచ్చం అడగాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం, రెండు లక్షల రుణ మాఫీ చేస్తాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుదాం కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.