కాంగ్రెస్ పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావు
ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ కాలరాశారు
కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైంది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. చేరికలన్నీ కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమే అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్ కాలరాశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
బుధవారం హైదరాబాద్ లో జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆకాంక్షలను సీఎం కేసీఆర్ కాలరాశారన్న రేవంత్. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లయినా కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. పొంగులేటితో పాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు.
‘‘తెలంగాణ ఏర్పాటుకు ప్రొ. జయశంకర్ పరితపించారు. తెలంగాణ జాతిపితగా జయశంకర్‌ను 4 కోట్ల మంది గౌరవించుకున్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీలపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పేరుగాంచారు. కానీ, ఆయన ఆశించిన ఫలితాలు రాలేదు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు ప్రయోజనం చేకూరలేదు. రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను వేదికగా మార్చారు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు పొంగులేటి, జూపల్లిని కలిశామని అలాగే పార్టీలోకి ఇద్దరినీ ఆహ్వానించినట్టు రేవంత్ తెలిపారు. రాజకీయ పునకీకరణ కోసం ఇప్పుడు పునాదులు వేసాం. పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.
“తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తాం. త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమవుతాం. ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఖమ్మం సభ ద్వారానే కేసీఆర్ ను పాతాళంలోకి తొక్కుతామని రేవంత్ అన్నారు. ఇవి ఆషామాషీ చేరికలు కాదు ఇందులో గొప్ప ఉద్దేశం ఉందని రేవంత్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే. వీళ్లే కాదు ఇంకా చాలా మంది కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచి ముహూర్తంలో వీరంతా కాంగ్రెస్ లో చేరుతారన్నారు.
తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు..ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆరెస్ లో చేరారు. తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదు. అందుకే వారంతా కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగరేశారు.పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యంఅందుకే వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి వచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“ఖమ్మం జిల్లా నుంచి సీఎల్పీ నేత, మహబూబ్ నగర్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు. మధ్య నల్లగొండ జిల్లా వారధిగా ఉంది. ఈ విధంగా మొత్తం కృష్ణాపరివాహక ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హరగోపాల్, విమలక్క , ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించిదన్నారు. విమలక్క తన పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిందన్నారు రేవంత్ రెడ్డి. విమలక్క మీద పెట్టిన ఉపా కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.