కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి
ఆల్క లంబకు వినతిపత్రం ఇచ్చిన ఇందిరా శోభన్
హైదరాబాద్ : చట్ట సభల్లో మహిళలకు కేటాయించనున్న 33 శాతం సీట్లలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లంబాకు ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆల్కలంబాను కలిసి, ఆమెకు ఇందిరా శోభన్ వినతిపత్రాన్ని సమర్పించారు. 33 శాతం సీట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే, ఆయా వర్గాల్లోని మహిళా నాయకురాళ్లకు అన్యాయం జరుగుతుందన్నారు. అగ్రవర్ణ మహిళలకు ఉన్న రాజకీయ పలుకుబడి, ఆర్థిక శక్తుల అండ, ఇతర వర్గాల్లోని మహిళలకు లేవన్నారు.

ఈ నేపథ్యంలోనే మహిళలకు కేటాయించే సీట్లలోనూ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళల సాధికారతకు ప్రాధాన్యతను ఇచ్చే కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో ఈ అంశంలో ఓ స్టాండ్ తీసుకోవాలని ఇందిరా శోభన్ విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పార్లమెంటులో కొట్లాడుతున్న ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని ఆల్క లంబాను ఇందిరా శోభన్ కోరారు.
Also Read-
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల మహిళలకు సాధికారత చేకూరాలంటే, చట్ట సభల్లో వారి వాటా వారికి దక్కాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీ గారు గ్రహించి, బీసీ ఎజెండాను ఎత్తుకున్నారు అని ఇందిరా శోభవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళా కాంగ్రెస్ తరపున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందులో భాగంగానే, తెలంగాణలో కూడా సీఎం రేవంత్‌రెడ్డిగారు కులగణన చేయించారని ఇందిరా శోభన్ పేర్కొన్నారు.