పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవాలు
హైదరాబాద్ : మానవాళి జీవితంలోని అన్ని అంశాలను కృత్రిమ మేథ (ఏ ఐ) ప్రభావితం చేస్తోందని, ఈ సాంకేతిక విప్లవం పట్ల వ్యతిరేక ధోరణి మాని దాన్ని సమర్ధంగా, బాధ్యతతో వినియోగించుకోవడం మీద దృష్టి పెట్టాలని సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మానేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం అన్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ) హైదరాబాద్ ఛాప్టర్ తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవాలకు బలరాం ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.


“ఏఐ మరీ కొత్త విషయం కాదు. ఇది ఎప్పటినుంచో ప్రభావం చూపుతూ ఉంది. మానవాళి మనుగడ దీనిమీద ఆధారపడి ఉందని అనడం అతిశయోక్తి కాదు,” అని ఆయన చెప్పారు. తాను సారధ్యం వహిస్తున్న సింగరేణి సంస్థ లో కూడా కాలానుగుణంగా టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అయన చెప్పారు. కార్మికులు, అధికారుల సమన్వయంతో సింగరేణిలో ప్రవేశపెట్టిన వినూత్న పథకాలను ఆయన విశదీకరించారు.


మహీంద్రా యూనివర్సిటీ డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ స్కూల్ ప్రొఫెసర్ శశిధర్ నంజుండయ్య కీలకోపన్యాసం చేస్తూ- వృత్తినిపుణులు ఏ ఐ ని ప్రభావశీలంగా ఎలా వాడుకోవచ్చో విశదీకరించారు. సమాచార ప్రసారంలో టెక్నాలజీ పాత్ర అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో నైతికత కు పెద్ద పీట వేయాలని
సూచించారు.


Also Read-

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీ ఆర్ ఎస్ ఐ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ బాజీ తన నలభై ఏళ్ల కెరీర్ లో పీ ఆర్ ను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎలా ప్రభావితం చేసిందీ వివరించారు. ఈ సందర్భంగా పీ ఆర్ ఎస్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ పంపిన సందేశాన్ని నేషనల్ కమిటీ సభ్యుడు మోహన్ రావు చదివి వినిపించారు.


పీ ఆర్ ఎస్ ఐ హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్, ఎం ఎన్ ఆర్ యూనివర్సిటీ డైరెక్టర్ (కొలాబరేషన్స్) మరియు ప్రొఫెసర్ (కమ్యూనికేషన్స్) డాక్టర్ ఎస్ రాము మాట్లాడుతూ ఏ ఐ టెక్నాలజీ ని సమర్థంగా వినియోగించుకోవడం ఎలాగో విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఛాప్టర్ కార్యదర్శి డాక్టర్ కంభంపాటి యాదగిరి వందన సమర్పణ చేశారు.



