హైదరాబాద్ : యాభై ఏళ్లుగా అప్రతిహతంగా నాణ్యమైన సమాచార ప్రసారం చేసి ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచడంలో గురుతర బాధ్యత నిర్వర్తించిన మేరు నగ ధీరుడు, మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీ రావు మరణం పట్ల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ) హైదరాబాద్ చాఫ్టర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసింది.
“తెలుగు జాతికి రామోజీ చేసిన సేవ ప్రశంసనీయం. వీరి కీర్తి ఆచంద్రతారార్కం. ఒక మధ్యతరగతి గ్రామీణ వ్యక్తి స్వయం కృషితో, క్రమశిక్షణతో సమున్నత శిఖరాలకు ఎలా ఎదగవచ్చో అయన జీవిత సమరాన్ని చూసి నేర్చుకోవచ్చు. ప్రజలలో స్ఫూర్తిని నింపి, శ్రమించి సంపద సృష్టించి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తయారుచేసిన ఆయన లేని లోటు తీర్చలేనిది,” అని పీ ఆర్, కమ్యూనికేషన్స్ ప్రొఫెషనల్స్ చెప్పారు. రామోజీ సతీమణి రమాదేవికి, ఈనాడు ఎండీ కిరణ్ కి, యావత్ కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎగ్జి క్యూటివ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఇది కూడ చదవండి-
ఆధునిక జర్నలిజంలో సకారాత్మక మార్పులకు రామోజీ రావు శ్రీకారం చుట్టారని, సమాచార స్రవంతి పట్ల వారికున్న ప్రత్యేక శ్రద్ధ యావత్ తెలుగు జాతికి ఎంతో ఉపకరించిందని పీ ఆర్ ఎస్ ఐ ఛైర్మన్, ఈనాడు జర్నలిజం స్కూల్ 1992 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ ఎస్. రాము చెప్పారు. రామోజీ గ్రూప్స్ తెలుగు జాతికి చేసిన సేవ మరువలేనిదని కార్యదర్శి యాదగిరి కంభంపాటి అన్నారు.
ఈనాడు లో పనిచేసి తర్వాత ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్లో పదవీ విరమణ పొందిన వాకిటి మధు మాట్లాడుతూ– రామోజీ గారు విలేకరుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వెన్నుతట్టి ప్రోత్సహించేవారని చెప్పారు. ఈనాడు గ్రూప్ లో పనిచేసి ప్రస్తుతం ఎన్ ఎమ్ డీ సీ లో ఉన్నత స్థానంలో ఉన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ రామోజీ ఒక సమున్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బాజీ, రాజేష్, మోహన్ రావు, సుబ్బారావు తదితరులు పాల్గొని రామోజీ రావుతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.