హైదరాబాద్ : పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనిషిని మనిషిగా చూడండంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మీరు అధికార మదంతో రెచ్చిపోయినా ప్రజల తీర్పు ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. నేను ప్రజల తరఫున గొంతు ఎత్తుతూనే ఉంటా. పినపాకలో నీకు పనేంటని కొందరు అంటున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చా’’ అని పొంగులేటి అన్నారు.
అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదని, వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను సెక్యూరిటీ అడిగితే మీరు ఇవ్వలేదు. ఇప్పుడు నా భద్రత తగ్గించినా నేను అడగను, ఉన్న ఇద్దరు గన్ మన్లను తీసేసినా నేను బాధపడను. నాకు సెక్యూరిటీ అవసరంలేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
పొంగులేటి మాట్లాడుతూ… ‘‘నాకు రాజకీయ గాడ్‌ఫాదర్ లేరు. తెలంగాణ ప్రజలే నాకు గాడ్ ఫాదర్. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతా. కేటీఆర్‌తో ఉన్న చనువుతో ఇన్ని రోజులు పార్టీలో కొనసాగా’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాగా, పినపాక ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కేసీఆర్, కేటీఆర్ పై నమ్మకంతోనే నాడు టీఆర్ఎస్ లో చేరానని వెల్లడించారు. అయితే, నాలుగేళ్లుగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు. నిజాన్ని అప్పుడూ నిర్భయంగా చెప్పాను, ఇప్పుడూ చెబుతాను. నా వ్యాపారలావాదేవీలపై త్వరలోనే చెబుతాను అని వెల్లడించారు. (Agencies)