హైదరాబాద్ : ఛలో బస్ భవన్ అంటూ బీఆర్ఎస్ నేతలు హడావిడి చేయడం హాస్యాస్పదం. ప్రజా క్షేత్రంలో ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకులు నాటకాలు వేస్తున్నారు. తమ పదేళ్ల కాలంలో బంద్‌లు, ధర్నాలు, నిరసనలపై ఉక్కుపాదం మోపిన వారికి చలో బస్ భవన్ అంటూ పిలుపునిచ్చే హక్కు లేదు అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గాంధీ భవన్ లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో అన్నారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… ఆర్టీసీ విషయంలో బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదు. కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో ఆర్టీసీని సర్వనాశనం చేశారు. బస్ భవన్‌కు బయలుదేరే ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాసి ఆర్టీసీ సిబ్బంది, కార్మికులకు క్షమాపణలు చెప్పాలి. గత పాపాలకు బీఆర్ఎస్ నేతలంతా ఆర్టీసీ కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలి. ఆర్టీసీ ఎంత మాత్రం మనుగడ సాగించదని దానిని ప్రైవేటుపరం చేయాలని కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు అన్నిరకాల ప్రయ్నతాలు చేశారు.
ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. ఆర్మూర్‌లో బీఆర్ఎస్ నాటి ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి రూ.7.50 కోట్లను ఆర్టీసీకి ఎగవేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జీవన్‌రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేసింది. కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో మూడుసార్లు భారీ ఎత్తున ఆర్టీసీ ఛార్జీలు పెంచిన విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు మరిచిపోయారా? బీఆర్ఎస్ హయాంలో మూడేళ్లకోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. 2016 జూన్ 27న ఆర్టీసీ ఛార్జీలను 8.78 శాతం పెంచారు. 2019లో సమ్మె ముగిసిన రోజే ఆర్టీసీ ఛార్జీలను 26.26 శాతం పెంచారు. నాడు కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచి ప్రయాణికులపై పెనుభారం మోపారు. 2022 జూన్ 09న ఆర్టీసీ ఛార్జీలను 20.51 శాతం పెంచారు.
Also Read-
తమ హయాంలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పాటు కార్మికులు, సిబ్బంది విషయంలో దురుసుగా ప్రవర్తించిన నీచ చరిత్ర బీఆర్ఎస్‌ది. మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో కొత్త బస్సులు కొన్నది లేదు. మౌలిక వసతులు మెరుగుపర్చింది లేదు. నగరంలో కాలుష్యం తగ్గింపునకు మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు (ఈవీలు) నడపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబా్ నగరంలో కేవలం 265 మాత్రమే ఈవీలుంటే వచ్చే మూడు నెలల్లో మరో 275 ఈవీలు రానున్నాయి. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్ నగరంలో డీజిల్ ఆర్టీసీ బస్సే ఉండదు. 2,800 ఈవీలు వస్తాయి. వీటితో శబ్ధ, వాయు కాలుష్యం తగ్గిపోతుంది..
తాజాగా ఆర్టీసీ గ్రీన్ ఫీతో కేవలం రూ.5 నుంచి రూ.10 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ గ్రీన్ ఫీతో రెండేళ్లలో ఆర్టీసీకి రూ.220 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఎలక్ట్రిక్ బస్సులు నడపాలంటే డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు, ఆ స్టేషన్లకు హైటెన్షన్ లైన్‌తో పవర్ కనెక్షన్ ఉండాలి. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్, హైటెన్షన్ కనెక్షన్ కు రూ.10 కోట్లు ఖర్చు అవుతుంది. గ్రీన్ ఫీతో వచ్చే మొత్తాన్ని ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, హెచ్‌టీ లైన్ల కనెక్షన్‌కు వినియోగిస్తారు. హైదరాబాద్‌లో ఆర్టీసీలో రోజుకు సగటున 24 లక్షల 37 వేల 418 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 18 లక్షల 28 వేల 063 మంది మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత ప్రయాణం) అమలు చేస్తుండడంతో మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. వారు టిక్కెట్ల ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అంటే గ్రీన్ ఫీకింద ఆర్టీసీ వసూలు చేసే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ నెమ్మదిగా లాభాలబాట పడుతోంది. ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో ఆర్టీసీని బద్నాం చేసే ప్రయత్న బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఆర్టీసీని నాశనం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యం. ఇందుకు వంద సాక్ష్యాలు మేం చూపుతాం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 2019 సంవత్సరంలో ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేస్తే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమ్మెపై ఉక్కుపాదం మోపారు. ఆర్టీసీ కార్మికులను, కార్మిక సంఘాల నాయకులను ఘోరంగా అవమానించారు. సమ్మె అంటే సస్పెండే అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ప్రకటనలు చేశారు. కార్మిక సంఘాలను పరిగణనలోకి తీసుకోలేదు. కార్మిక సంఘాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు.
2019 సమ్మె సమయంలో కేసీఆర్ మొండి వైఖరి… నాటి మంత్రుల మూర్ఖపు వాదనలతో ఆర్టీసీ డ్రైవర్లు ఆవుల నరేష్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్యలు చేసుకున్నారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పని చేసే సురేందర్ గౌడ్ 2018లో తన బిడ్డ పెళ్లికి బ్యాంకు లోన్ తీసుకున్నారు. 2019 సమ్మె సమయంలో సెప్టెంబర్ నెల జీతం ఇవ్వకపోవడం. ఈఎంఐకు సంబంధించిన చెక్కు బౌన్స్ అవడంతో ఒత్తిడికి గురై సురేందర్ గౌడ్ ఉరి పెట్టుకొని చనిపోయారు. ఉద్యోగం నుంచి తొలగిస్తామనే కేసీఆర్ మాటతోనే సురేందర్ గౌడ్ కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని సురేందర్ గౌడ్ భార్య నాడు చెప్పారు.. ఈ విషయం తప్పని కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు అనగలరా?
ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోరుతూ ఖమ్మంకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటిచుకోని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సమ్మె సమయంలో వరుసగా రెండు నెలలు జీతం ఇవ్వకపోవడంతో మహబూబాబాద్ డిపో పరిధిలో డ్రైవర్ ఆవుల నరేశ్ పురుగుల మందు తాగి చనిపోయారు. ఆ సమయంలో అనేక మంది ఆత్మహత్యాయత్నాలు చేశారు. పలువురు ఆందోళనలతో వ్యాధులబారిన పడ్డారు. వీటన్నింటికి బీఆర్ఎస్ నాయకులు ఏం సమాధానమిస్తారు. సమ్మె పేరెత్తితేనే డిస్మస్ చేస్తామంటూ కేసీఆర్ నాడు ఆర్టీసీ సిబ్బందిని, కార్మికులను బెదిరించారు. చివరకు వారిని తొలగించి తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు దయ చూపమంటే చూపానంటూ చెప్పారు.
ఆర్టీసీ ఆస్తులు కాజేయడం.. సమ్మె చేసినందుకు ఆర్టీసీ సిబ్బంది, కార్మికుల ప్రాణాలు బలిగొనడం. ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేయడం వంటి పనులు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఏముఖం పెట్టుకొని ఛలో బస్ భవన్ అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ అప్పులబారిన కూరుకుపోయింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. మహిళా టిక్కెట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుండడంతో ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది. ఆర్టీసీ విషయంలో బీఆర్ఎస్ బూటకపు వైఖరిని ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు గమనించాలి. తమ తప్పులకు, పాపాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే బీఆర్ఎస్ నేతలు చలో బస్ భవన్‌కు బయలుదేరాలి.
