హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్దిదారులు ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ లతో కలిసి జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ల, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎస్.సి. కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు చిన్నపాటి రుణాలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జూలపల్లి మండలంలోని 25 మందికి చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావడానికి వ్యాపారం ప్రారంభించుటకు మొదటి విడతగా 15 వేలు ఇప్పటికే మంజూరు చేశామని, రెండవ విడతగా ప్రస్తుతం 35 వేలు చెక్కులను అందజేస్తున్నామని, అలాగే మహిళలకు 3 నెలలపాటు శిక్షణ అందించి 46 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ కల్పించి ప్రోత్సహించి ఆర్థికంగా ఆత్మస్థైర్యం కల్పించామని, ప్రభుత్వం ద్వారా కల్పించిన శిక్షణను, మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న శిక్షణ పనికి రావాలని, నేర్చుకున్న వృత్తి తో నమ్మకం కలిగి ఆర్థికంగా ఎదగాలని, నేర్చుకున్న కుట్టు శిక్షణతో పాటు మగ్గం వర్క్ చేయడం, మంచి డిజైన్ నైపుణ్యంతో రాణించి ఎక్కువ మొత్తంలో బట్టలు కుట్టే విధంగా, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి, వినియోగ దారులకు నమ్మకం కలిగించేలా పనిచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వార ఆనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని, జిల్లాలోని మూడు నియోజవర్గం లోని 259 మందికి దళిత బందు యూనిట్లను పంపిణీ చేపట్టి నిరుపేదలను, కూలీలుగా, డ్రైవర్ లు గా ఉన్నవారిని ఓనర్ లుగా మార్చడం జరిగింది అని, బ్యాంక్ తో సంబంధం లేకుండా 10 లక్షలు వాటి అకౌంట్ లో వేసి వారి ఇష్టానుసారం వృత్తి చేసుకునే విధంగా దళిత బందు ను దేశంలోనే ఎక్కడాలేని విధంగా అమలు చేస్తున్నాం అని, ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. మొదటి విడతలో నియోజక వర్గానికి 100 మందికి అవకాశం కల్పించామని, దశలవారీగా అందరికీ అవకాశం కల్పించి రానున్న ఏడెండ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని తెలిపారు.

దళితులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని, ఈ రోజు రైతులు సుఖః సంతోషాలతో ఉన్నారంటే అందుకు కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతానని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మాకు ఎందుకు అందడం లేదని దేశమంతా కూడా మన వైపు చూస్తున్నదని, గొల్లకుర్మల కు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 80 లక్షల యూనిట్ల గొర్రెలను రాష్ట్రంలో పంపిణీ చేయడం జరిగిందని, ముదిరాజ్, గంగపుత్రులు, గౌడ సొదరులకు ఇలా అన్ని వర్గాలకు ఏదో ఒక విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పించి వారి ఆర్థిక అభివృద్ధికి పాటు పడుతున్నదని తెలిపారు.

రాష్ట్రంలో 48 లక్షల మందికి పెన్షన్ లు అందిస్తున్నామని, ఏ రాష్ట్రంలో కూడా ఇంతమందికి ఇవ్వడం లేదని, బడాయిలు చెప్పే ప్రధానమంత్రి వారి రాష్ట్రంలో కూడా 750 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 950 రూపాయలను కేవలం 12 లక్షల మందికి అందిస్తున్నారని, మన రాష్ట్రంలో 48 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నదని, విద్య, వైద్యం, అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన సేవలను అందిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నదని తెలిపారు.

ఎమ్మేల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పలు పథకాలను, కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, ఎనిమిది ఏళ్ల క్రింద ఉన్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులను పరిశీలన చేయాలని, ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా కార్యక్రమాలు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నదని అని, దాని విధి విధానాలు పూర్తి చేసి త్వరలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 3 నెలల పాటు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ లతో పాటు, కుట్టు మిషన్ లను, వ్యాపారం నిమిత్తం రెండవ విడత 35 విలువ గల చెక్ లను మంత్రి, ఎమ్మేల్యే అందించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవ రావు, ఎంపిపి కూసుకుంట్ల రమాదేవి, వైస్ ఎంపిపి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కా రెడ్డి, సర్పంచ్ మేచినేని సంతోష్ రావు, ఉప సర్పంచ్ కొత్త మల్లేష్, ఎంపిటిసి తమ్మడవేన మల్లేశం, వార్డ్ సభ్యులు, గ్రామ కో ఆప్షన్ మెంబర్లు, ఈ.డి.ఎస్సీ కార్పొరేషన్, తహసిల్దార్ అబుబకర్, ఎంపిడిఓ వేణుగోపాల్ రావు, పంచాయతీ కార్యదర్శి జార్తి అంజలీదర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
