వారిలా మేము తిట్టదలుచుకోలేదు… మాకు సంస్కారం ఉంది
35 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం
ఏనాడు వ్యక్తిగత దూషణకు దిగలేదు
విమర్శించడానికి ఓ హద్దు ఉంటుంది
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?
చిన్న, పెద్ద, మహిళలు అనే తేడా తెలియదా?
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా?
సీయం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
తెలంగాణలో విచ్చిన్న, విభజన రాజకీయాలకు తావు లేదు
కులం, మతాలను అడ్డం పెట్టుకుని మీలా రాజకీయాలు చేసే పార్టీ కాదు మాది
చిల్లరమల్లర మాటలు బంద్ చేసి అభివృద్ధిపై మాట్లాడండి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు
తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా?
కేంద్రం తెలంగాణకు చేసింది గోరంతైతే దాన్ని కొండంతలు చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారు
నిర్మల్ : బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నామని, ఏనాడు వ్యక్తిగత దూషణకు దిగలేదని, కానీ బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ….
“విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఇనేళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు వ్యక్తిగత దూషణలకు దిగలేదు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం కామన్. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు, చిన్న పెద్ద, అనే తేడా లేకుండా బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన నిర్మల్ సభలో గౌరవ సీయం, గౌరవ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వారిలా మేము తిట్టదలుచుకోలేదు… మాకు సంస్కారం ఉంది.
అభివృద్ధి పై విమర్శలు చేయండి, ఫలానా వ్యక్తి ప్రభుత్వ పథకాలు రాలేదని చూపించండి తప్పులేదు. కానీ వ్యక్తిగత దూషణలు అది కూడా అన్ పార్లమెంటరీ మాటలు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి పరాకాష్ట. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా? కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి? గడిచిన 8 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కండ్ల ముందు కనిపించ లేదా?
“ప్రజా సంగ్రామ యాత్రలో బూతు పురాణం తప్ప ప్రజలకు పనికి వచ్చేది ఒక్క విషయం అయినా మాట్లాడారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, నిర్మల్ నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పారా బీజేపీ నేతలు స్టేట్‌మెంట్లకే పరిమితం అయ్యారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క హామీనైనా ఇచ్చారా? రైల్వే లైన్ ఏర్పాటు ఏమైంది, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలి. నిర్మల్ లో సైన్స్ సెంటర్ & ప్లానెటోరియం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని అడిగితే కేంద్రాన్ని కోరితే నిధులు ఇచ్చారా? వేలాది మందికి ఉపాది చూపే సీసీఐ పునరుద్ధరణకు ఎలాంటి సహయసాకారాలు అందించేందుకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రానికి ఎన్ని లేఖలు రాసిన కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్ర అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగిన కేంద్రం నుంచి సమాధానం లేదు. బీజేపీ నాయకులు మాత్రం ఇవేమి మాట్లాడకుండా తిట్టడం ధ్యేయంగా ఇక్కడ సభ పెట్టుకున్నారు.”
“ఈ సభ వల్ల మా నిర్మల్ ప్రజలకు పైసా మందం కూడా మేలు జరగలేదు. ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంత ప్రజల్లో చిచ్చుపెట్టడానికి ప్రయత్నించారు తప్పా… ప్రజల మంచి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. టీఅర్ఎస్ ప్రభుత్వ ఏకైక ఎజెండా సబ్బండ వర్ణాల సంక్షేమం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై తప్పా మాకు ఇంకో ధ్యాస లేదు. కానీ బీజేపీ నాయకులు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుని యాత్రలు చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వ ధ్యాస ఒక్కటే… రాష్ట్ర ప్రభత్వాలను కూలగొట్టడం, మాట వినని వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయడం అదే కదా మీకు తెలిసింది. ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు అప్పగించడం ఇది తప్పా మీరు చేస్తున్నదేంటి? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ పేద వారికి అందుతున్నాయి. కులం, మతం, అనే భేదం లేకుండా అన్ని వర్గాల వారికి పథకాలను అమలు చేస్తున్నాం. డబుల్ బెడ్ రూం, రైతుబంధు, ఫించన్లు, విద్యా, వైద్యం ఇలా అన్ని రకాల సంక్షేమ పథకాలను అన్ని కులాలు, మతాల వారికి ఇస్తున్నాం. మీలా విభజన రాజకీయాలు చేయడం లేదు.”