ఆలయానికి విలువైన 10 ఎకరాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు
విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం, 20 కోట్లు మంజూరు చేసిన ఏపీ సీఎం జగన్ కి, టిటిడికి ధన్యవాదాలు
ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం వెయ్యేళ్లకు దొరకని అదృష్టం
శ్రీవారి ఆశీర్వాద బలమే ఈ ఆలయం, అందుకు తార్కాణం సహజసిద్ధ కోనేరు, శ్రీవారికి ఇష్టమైన చింత చెట్లతో ప్రాంగణం
శ్రీవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్
తిరుమల మాదిరే కరీంనగర్ లోను సర్వ కైంకకర్యాలు
టీటీడీ తరపున అర్చకులు, సిబ్బంది, ప్రసాద పోటు తదితరాలు
కరీంనగర్, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
హైదరాబాద్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కరీంనగర్లో అత్యంత వైభవంగా నిర్మిస్తూ శంకుస్థాపనం చేశామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నేడు పద్మనగర్ ప్రాంగణంలో తిరుమల తిరుపతి వేదపండితులచే టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు రసమయి, సుంకే రవిశంకర్ ఎమ్మెల్సీలు విప్ లు భాను ప్రసాద్ రావు, కౌశిక్ రెడ్డి, టిటిడి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు తదితర ప్రముఖుల, అశేష జనవాహిని సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది.
ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, శంఖువుకు, అభిషేకం అనంతరం వేదమంత్రాలతో శంకుస్థాపన నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుని కృపతోనే కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారం అయిందన్నారు, ఆలయ స్థలంలో ఆ దేవదేవుడే కోనేరు లాంటి పురాతన బావిని తనకిష్టమైన చింత చెట్టును ఏర్పాటు చేసుకోవడమే ఈ వైభవానికి నిదర్శనం అన్నారు.
రాష్ట్ర రాజధాని లో మాత్రమే ఉండే టిటిడి ఆలయాన్ని కరీంనగర్లో నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దృష్టికి స్థానిక ప్రజా ప్రతినిధులు తీసుకెళ్లిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి ప్రత్యేకంగా లేఖ రాయడం, కరీంనగర్ లో పదెకరాల స్థలాన్ని కేటాయించడం, తదనంతరం ఏపీ సీఎం ఆమోదంతో టీటీడీ బోర్డు ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరగడం చాలా సంతోషకర మన్నారు.
టీటీడీ 20 కోట్ల నిధులతో ఆలయాన్ని నిర్మిస్తుందని మిగతా నిర్మాణ నిధులను భక్తులమే సమకూర్చుకుంటామన్నారు. వెయ్యేళ్ల కాలంలో దొరికే ఈ గొప్ప కార్యంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు మంత్రి, కరీంనగర్ ప్రజలందరికీ ఈ అదృష్టం దొరికినందుకు భక్తుడిగా సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవ్వాలని కోరారు మంత్రి గంగుల.
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన టిటిడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కరీంనగర్ ఆలయ నిర్మాణం కోసం మంత్రి గంగులతో పాటు వినోద్ కుమార్, భాస్కరరావు, దామోదర్ రావు అభ్యర్థించారని, సీఎం కేసీఆర్ గారి విజ్ఞాపనతో ముఖ్యమంత్రి జగన్ గారు నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. టీటీడీ తరఫున 20 కోట్ల నిధులను కేటాయించడంతోపాటు సంపూర్ణంగా తిరుమల మాదిరే క్రతువులు నిర్వహిస్తామని, తిరుమల వేద పండితులు నిరంతరం ఇక్కడే ఉంటారన్నారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ సంతోషం కలిగిస్తుందన్నారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ లోనే టిటిడి అర్చకులకు ప్రత్యేకంగా వసతి నిర్మాణంతో పాటు, సమస్త కైంకర్యాలను ఆగమ శాస్త్ర పద్ధతుల్లో చేస్తామన్నారు. నిర్మించనున్న టీటీడీ ఆలయం నగరానికి వాస్తు సొబగులు అద్దడంతో పాటు ఆ బ్రహ్మాండ నాయకుని దీవెనలను అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.