స్వతంత్ర భారతాన గాంధీజీ “మహాత్మ” అయితే, అది స్వతంత్ర భారతానికి వందేళ్ళ ముందే బడుగు బలహీన వర్గాలచే “మహాత్ముడి”గా జన నీరాజనాలు అందుకున్న సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిబాఫూలే.
1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన జ్యోతిరావ్ గోవింద్ రావు ఫూలే అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతియై, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు. వారి తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది.
సంవత్సరం వయస్సులోపే తల్లిని కోల్పోయిన ఫూలే, ఏడు సంవత్సరాల వయస్సులో ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించి, తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. పుస్తక పఠనం పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉన్న ఫూలేను చూసి ఇంటి ప్రక్కనే ఉన్న ఒక ఉపాధ్యాయుడు, ఒక పెద్ద మనిషి జోతిరావ్ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు.
చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే. జ్యోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.
సమాజంలో సగభాగమైన స్త్రీలు నిరక్షరాస్యులు అయితే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని, కావున స్త్రీలు విద్యావంతులు కావాలని ముందు తన భార్య సావిత్రీబాయిని పాఠశాలకు పంపి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అంతే గాక అన్నికులాలవారు చదువుకునేలా పాఠశాలలను స్థాపించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు.
ఆనాటి సమాజంలో జరిగే బాల్యవివాహాల వల్ల చిన్నతనంలోనే వితంతువులైన మహిళలకు పునర్వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. దేశంలోనే మొట్టమొదటిగా ‘బాలహత్య ప్రతిబంధక్ గృహ కేంద్రాన్ని స్థాపించి, వితంతు గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచారు.
1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి అని కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాటం మొదలు పెట్టి సత్యాన్ని నిగ్గుతేల్చిన సత్యాన్వేషకుడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణులనువిమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపి వేదాలకు కొత్త భాష్యం చెప్పిన భాష్యకుడు.
సామాజికోద్యమాలకు ఆద్యుడై స్వేచ్ఛా, సమానత్వ, ఐక్యమత్య సమాజంకై అనునిత్యం శ్రమించాడు. స్త్రీ, పురుష లింగ వివక్ష, కుల బానిసత్వం పై అలుపెరుగని పోరాటం చేశాడు. సామాజిక రుగ్మతల్ని నిర్మూలించ గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకా థాతిల్, బ్రాహ్మణ్ పంతోజి మొదలెైన రచనలు చేశారు.
దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి గౌరవ కానుకగా సమర్పించిన ‘గులాంగిరి’ మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం.
వితంతు మహిళా, అనాధ శిశువులకై ‘సేవాసదనం’ స్థాపించాడు. బహుజనుల్ని బానిసలు చేసిన దాస్య భావాల బోధకులను ఎదిరించి, వర్ణవ్యవస్థ పై తిరుగులేని బావుటా ఎగరవేసిన తిరుగుబాటుదారుడు. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే.
రైతుల, కార్మికుల సమస్యలు బాధలు వివరించేందుకు ‘దీనబంధు’వారపత్రికను స్థాపించాడు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా. బి. ఆర్. అంబేడ్కర్ ప్రకటించారు. సమసమాజ స్థాపనకై అనునిత్యం శ్రమించిన జ్యోతిబాపూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు. బహుజనుల స్వతంత్రంకై సమరం సలిపిన ఆ మహానీయుడి జన్మదినాన వారిని స్మరించుకుందాం. అలాగే ఆయన చూపిన బాటలో నడుస్తాం.
డా. కమలేకర్ నాగేశ్వర్ రావు ‘సాహితీ మిత్ర’
అచ్చంపేట నాగర్ కర్నూలు జిల్లా
9848493223