Covid-19 : “ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం”

కోవిడ్ వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు

అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలి

అన్ని పీ హెచ్ సి, యూ పి హెచ్ సి లలో వాక్సిన్ అందుబాటులో ఉంచాలి

రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్ : నూతన వేరియంట్లతో పలు దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి అన్ని విభాగాల వైద్యాధికారులతో చర్చించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కొవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు చికిత్స పొందాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్ డోసు పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు.

ఇప్పటి వరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించడం జరిగిందన్నారు. 1.35 కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేయగా, 1.62 కోట్ల ప్రికాషన్ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. కొవిడ్ నుంచి తమను తాము రక్షించుకోవడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పిహెచ్సీలు, యూపీహెచ్సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరానికి సరిపడా కేంద్రం డోసులు సరఫరా చేయని నేపథ్యంలో, పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరిన్ని డోసులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జూమ్ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X