హైదరాబాద్ : ధరణి అక్రమాలపై బీఆర్ఎస్ నేతలను కాపాడటానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోంది అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో పేర్కొన్న 8వ రంగం భూ పరిపాలన (రెవెన్యూ అంశాలు) లో ధరణి స్ధానంలో భూ మాత పోర్టల్ ప్రవేశపెడతామన్నారు. ఏ మైంది? అసలు ధరణి పోర్టలు నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా?
సమగ్ర భూకమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి చేశారు? ఇంతకీ ఇలాంటి భూ సర్వే వల్ల నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించిందా? ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించి, పౌరుల భూ హక్కులను కాపాడేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామన్నారు కదా, మరి ఆ దిశగా కనీసం కసరత్తు అయినా మొదలెట్టారా?
నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తొలగిస్తామన్నారు కదా, మరి ధరణి పోర్టల్ పై ఐదుగురు సభ్యులతో కమిటీ (2023 డిసెంబర్ 9న వేసారు) వేసి ఏడున్నర నెలలైంది కదా, నిషేధిత జాబితాలో 13 లక్షల ఎకరాలు ఉన్నట్టు సమాచారం. మరి వాటిలో కనీసం కొన్ని అయినా తొలిగించారా? ధరణి పోర్టలును అప్పటి కేసిఆర్ సర్కారు 2020 నవంబర్ 29న ప్రారంభించింది. అప్పటి నుంచి మూడేళ్ల కాలంలో అంటే 2023 నవంబర్ వరకు, లక్షల ఎకరాలను బీఆర్ఎస్ లీడర్లు, పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలున్నాయి. ఆ లెక్కలేంటో, భూములు కోల్పోయిన రైతులు ఎవరో, లాభపడిన గులాబీ నేతలెవరో కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికి తేలుస్తుంది.
Also Read-
తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డు భూములున్నాయి. మరిపుడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయి. అసైన్డు భూములను బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి, వారి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వివరాలేవి? వాటిని ఎందుకని రేవంత్ సర్కారు బయట పెట్టడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, అసైన్డు భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు, భూదాన భూములు లక్షల ఎకరాలు కేసిఆర్ సర్కారు పదేళ్ల కాలంలో అన్యాక్రాంతమయ్యాయని, వాటి విలువ రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేసిఆర్ సర్కారు పదేళ్ల కాలంలో అన్యాక్రాంతమైన భూముల అంశంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.
అంటే కేసిఆర్ హయాంలో జరిగిన రెండు లక్షల కోట్ల భూ కుంభకోణం దేశ చరిత్రలోనే అత్యంత భారీ స్కామ్. ధరణి పోర్టల్ నిర్మాణం, నిర్వహణ ఒప్పందాన్ని విదేశీ కంపెనీ ఫాల్కన్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అప్పటి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్, రెవెన్యూ శాఖ మంత్రి స్వయంగా సిఎం కేసిఆరే. మరి ఇలా కేసిఆర్, కేటిఆర్ లకు ప్రమేయమున్న ఈ రెండు లక్షల కోట్ల భారీ స్కాము లోగుట్టును బయటపెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వెనకాడుతోంది. కేసిఆర్ ను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కాపాడుతోంది. సిఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో రోజే ధరణి పోర్టలుపై రివ్యూ మీటింగ్ పెట్టారు. ఐదుగురు సభ్యులతో కమిటీ వేసి, ఏడున్నర నెలలైనా ఇప్పటికీ దోషులెవరో తేల్చలేదు. ధరణి పోర్టలుతో జరిగిన రెండు లక్షల కోట్ల స్కామును వెలికితీసే చిత్తశుద్ధి, ధరణిని అడ్డం పెట్టుకుని భూ అక్రమాలకు పాల్పడి బీఆర్ఎస్ నేతలను దోషులుగా నిరూపించే చిత్తశుద్ధి సిఎం గారికి ఉన్నట్లయితే, ఈ స్కాము విచారణను సిబిఐకి అప్పగించాలి.